
ఓ వ్యక్తిని బెదిరించి అతని పర్స్, మొబైల్ లాక్కెళ్లిన ఇద్దరు దొంగలు విచిత్రంగా పోలీసుల చేతికి చిక్కారు. వివరాల్లోకి వెళితే.. నోయిడాలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి డిన్నర్ చేయడం కోసం బయటకు వచ్చాడు.
ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి... సదరు వ్యక్తిని గన్‌తో బెదిరించారు. అతని వద్ద నుంచి పర్స్, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. అందులో బాధితుడి ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డు ఉన్నాయి.
అయితే ఏటీఎం కార్డును ఉపయోగించాలంటే పిన్ కావాలని గుర్తొచ్చిన ఇద్దరు దొంగలు కొంత దూరం వెళ్లి వెనక్కి వచ్చారు. మళ్లీ తుపాకితో బెదిరించి ఏటీఎం పిన్ నెంబర్ చెప్పాల్సిందిగా కోరారు.
అతను చెప్పిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ విషయం గురించి బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఓ చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు నిందితుల బైక్‌ను అడ్డుకున్నారు.
ఊహించని ఈ పరిణామంతో అవాక్కయిన దుండగులు.. పోలీసుల మీద కాల్పులకు తెగబడ్డారు. దీనిపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. నిందితులను బైక్ ఆపాల్సిందిగా కోరామన్నారు. కానీ వారు పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశారని.. దీంతో అధికారులు కూడా కాల్పులు జరపడంతో వారికి గాయాలయ్యాయని తెలిపారు.
గాయపడ్డ సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని.. నిందితులిద్దరిని గౌరవ్ సింగ్, సదానంద్‌గా గుర్తించామన్నారు. వీరి వద్ద నుంచి రూ.3,200 నగదు, ఏటీఎం కార్డ్, పర్సుతో పాటు రెండు నాటు తుపాకులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.