
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. చైనా, వియత్నాం, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో మన దేశంలోనూ కరోనా కేసులు నిలకడగా ఉండటంపై కొంత కలవరాన్ని కలిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,528 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. రికవరీలు చెప్పుకోదగ్గట్టుగానే ఉన్నాయి. ఒక్క రోజులో 3,997 రికవరీలు జరిగాయి. కాగా, 149 మరణాలు చోటుచేసుకున్నాయి. వారం రోజుల్లో కరోనా మరణాలు ఇవే అత్యధికం. చివరిసారిగా 11వ తేదీన 255 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కరోనా మరణాలు 100 సంఖ్యను దాటలేదు. తాజాగా, 149 మరణాలు చోటుచేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా క్రియా శీలకంగా 29,181 కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.40 శాతం ఉన్నది. తాజా అప్‌డేట్‌తో దేశంలో కరోనా కారణంగా చోటుచేసుకున్న మొత్తం మరణాలు 5,16,281గా ఉన్నాయి. కాగా, 24 గంటల్లో 6,33,867 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్రం తెలిపింది.
కేంద్ర ఆరోగ్య శాఖ నిన్న ఉదయం వెల్లడించిన కరోనా బుల్లెటిన్ ప్రకారం, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,539 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, 60 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసులు ఇంతకంటే తగ్గడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 0.35 శాతం. ఇదిలా ఉండగా, 24 గంటల్లో 4,491 రికవరీలు జరిగాయి. మొత్తం రికవరీలు 4,24,54,546కు చేరాయి. కాగా, మొత్తం మరణాల సంఖ్య 5,16,132కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 7,17,330 కరోనా టెస్టులు నిర్వహించారు.
ఇదిలా ఉండగా, కరోనా కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 టెక్నికల్ లీడ్ మారియా వ్యాన్ ఖెర్కోవ్ స్పందించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన వారాల వ్యవధిలో మళ్లీ పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. కరోనా టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ కేసులు ఎక్కువగా రిపోర్ట్ కావడం ఆందోళనకరం అని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి బలంగా సాగుతున్నట్టు ఆమె అంచనా వేశారు. ముఖ్యంగా కరోనా ఆంక్షలు ఎత్తేసిన ప్రాంతాల్లో కేసులు విపరీతంగా రిపోర్ట్ అవుతున్నాయని ఆమె తన ట్వి్ట్టర్ ఖాతాలో వివరించారు.