Covid 19: కేసులు తగ్గుతున్నాయి.. ఆంక్షలు ఎత్తివేయండి : రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

Siva Kodati |  
Published : Feb 16, 2022, 10:01 PM IST
Covid 19: కేసులు తగ్గుతున్నాయి.. ఆంక్షలు ఎత్తివేయండి : రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

సారాంశం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించడంపై కేంద్రం బుధవారం కీలక సూచన చేసింది.  కేసులు, పాజిటివిటీ రేటును బట్టి ఆంక్షల్లో మార్పులు చేయడమా లేక పూర్తిగా ఎత్తివేయడమా అనే నిర్ణయాన్ని తీసుకోవాలని దిశా నిర్దేశం చేసింది. 

కొద్దిరోజుల పాటు దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారి (coronavirus) గడిచిన కొంతకాలంగా తగ్గుముఖం పడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో కోవిడ్ కట్టడి కోసం విధించిన ఆంక్షలను సడలించడంపై కేంద్రం బుధవారం కీలక సూచన చేసింది. ఆయా నిబంధనలపై పునఃసమీక్ష చేసుకోవాలని సూచించింది. కేసులు, పాజిటివిటీ రేటును బట్టి ఆంక్షల్లో మార్పులు చేయడమా లేక పూర్తిగా ఎత్తివేయడమా అనే నిర్ణయాన్ని తీసుకోవాలని దిశా నిర్దేశం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది.  

వైరస్‌ కట్టడిని సమర్థవంతంగా కొనసాగించడంతోపాటు ప్రజలు, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగడం కూడా అంతే ముఖ్యమని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాల సరిహద్దుల వద్ద విధించిన ఆంక్షలు వీటికి ఆటంకం కాకూడదని అభిప్రాయపడింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పడుతోందన్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న మార్గదర్శకాలపై ఇటీవలే సమీక్ష నిర్వహించామన్నారు. ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శకాలను ఫిబ్రవరి 10న విడుదల చేశామని ఆయన గుర్తుచేశారు. ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ కొవిడ్‌ కట్టడికి ఐదు అంచెల వ్యూహాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూనే ఉండాలని రాజేశ్ భూషణ్ సూచించారు. 

కాగా.. ఒమిక్రాన్ కారణంగా జనవరి నెలలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి అధికంగా ఉంది. జనవరి 21న గరిష్ఠంగా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఇకపోతే.. దేశవ్యాప్తంగా గడిచిన వారం సరాసరి 50వేలుగా నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 27 వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 3.6శాతానికి పడిపోయింది. 

మరోవైపు కరోనావైరస్ ఓమిక్రాన్ వేరియంట్ (omicron)  ప్ర‌భావం యూరోపియ‌న్ (Europe) దేశాల్లో ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపింది. కొత్త కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని ఈ విష‌యాన్ని తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌నీ, ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు త‌గ్గిపోలేద‌ని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ కొత్త  కోవిడ్‌-19 వేవ్ ఐరోపాకు తూర్పు వైపు కదులుతున్నట్లు WHO తెలిపింది. ఈ ప‌రిస్థితులు దారుణంగా మార‌కుండా.. కోవిడ్-19 క‌ట్ట‌డి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచాల‌ని తెలిపింది. 

అంద‌రికీ కోవిడ్‌-19 టీకాలు అందేలా చూడాల‌ని సూచించింది. గత రెండు వారాల క‌రోనా వైర‌స్ గ‌ణాంకాల‌ను గ‌మ‌నిస్తే..  ఆర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, జార్జియా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో కోవిడ్‌-19 కొత్త కేసులు రెండింతలు పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో తెలిపారు. రోజువారీ కేసులే తగ్గుతూ ఉంటే వచ్చే నెలలో ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న కోవిడ్ ఆంక్ష‌ల‌ను సడలించాలని అనేక యూరోపియన్ దేశాలు సూచించిన సమయంలో ఆయ‌న‌ ఈ వ్యాఖ్యలు  చేయ‌డం ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !