
టీనేజర్లలో కోవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ ను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ (rajesh bhushan) రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఇదే సమయంలో మొదటి డోసు వేసుకోని 15-18 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించాలని చెప్పింది.
‘‘ 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రెండో డోసు వ్యాక్సిన్ కవరేజ్ (vaccine coverage) ను వేగవంతం చేయడానికి సంబంధిత అధికారులను ఆదేశించాల్సిందిగా నేను మిమల్ని అభ్యర్థిస్తున్నాను. మొదటి డోసు లబ్దిదారులకు కూడా వ్యాక్సిన్ అందించండి.’’ అని ఆ లేఖలో రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులందరూ టీకా పొందడానికి అర్హులని ఆ లేఖ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల చొరవతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 166.68 కోట్ల డోసులు అందించామని లేఖ పేర్కొంది. ఇది ప్రపంచంలోనే పెద్ద వ్యాక్సినేషన్ అని తెలిపింది.
ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి కోవిడ్ -19 (COVID-19) వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. నేటి వరకు టీనేజ్ పిల్లలకు 4.66 కోట్ల కంటే ఎక్కువ డోస్‌లు అందాయి. దీంతో పిల్లల్లో మొదటి డోస్ కవరేజ్ 63 శాతంగా ఉంది. టీనేజ్ పిల్లలకు కోవాగ్జిన్ అందజేస్తున్నారు. పిల్లలకు రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులుగా ఉంటుంది. టీకా షెడ్యూల్‌ను సకాలంలో పూర్తి చేయాలని, టీకా తీసుకునే వారిలో నమ్మకం కల్పించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ లేఖలో సూచించింది.
భారత ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలకు 164.89 కోట్ల (1,64,89,60,315) కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు అందించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ (vaccination drive)లో భాగంగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ కార్యక్రమం 16 జనవరి 2021న ప్రారంభమైంది. జూన్ 21, 2021 నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.
కరోనా మొదటి దశలో కోవిడ్ వారియర్స్ (covid wariars) కు, ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ లను అందించారు. అనంతరం ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేశారు. తరువాత 18 ఏళ్లుపై బడిన అందరికీ వ్యాక్సిన్ అందించడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగింది. గతేడాది డిసెంబర్ నుంచి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించడం మొదలు పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. జనవరి 3 నుంచి టీనేజ్ పిల్లలకు అంటే 15-18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ అందించాలని అ నిర్ణయిచింది. అలాగే జనవరి 10వ తేదీ నుంచి కోవిడ్ వారియర్స్ కు అదనంగా మరో ప్రికాషనరీ డోసు అందిస్తోంది.