
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 2024 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో(Loksabha Elections) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) నుంచి పోటీ చేస్తుందని వివరించారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల్లో మేం ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తాం’ అని వెల్లడించారు. 2024 జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీని ఓడించడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. ‘ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం కావాలని నేను కోరుకుంటున్నాను. అన్ని కలిసి పోరాడి 2024లో బీజేపీని ఓడించాలి’ అని అన్నారు. అంతేకాదు, ఏడెనిమిది మంది బీజేపీ నేతలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని వివరించారు. వారు తమ పార్టీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారాన్ని కాంక్షించే ఏ పార్టీ అయినా.. ఉత్తరప్రదేశ్‌లో మెరుగైన ఫలితాలనే ఆశిస్తాయి. ఎందుకంటే.. ఈ రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 80 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండో అత్యధికం మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో 48 సీట్లు ఉండగా, దాదాపు రెండింతల మేర యూపీలోనే ఉన్నాయి.
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆమె కటువుగా స్పందించారు. ఈ బడ్జెట్ కార్మికులు, కర్షకులకు, సామాన్య ప్రజలకు ఏమీ ప్రకటించలేదని మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రజలతో కలిసి పని చేయడాన్ని నమ్ముతుందని, ఏజెన్సీలను పట్టుకుని వేలాడదని పేర్కొన్నారు. కానీ, బీజేపీ ప్రజల కంటే ఎక్కువగా ఏజెన్సీలనే నమ్ముతుందని అన్నారు. బీజేపీకి మూడు ఆభరణాలు ఉన్నాయని, అవి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నగదు అని తెలిపారు.
అదే సందర్భంగా ఆమె రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ దళారులు ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో పెద్ద దళారి పెగాసెస్ కంటే కూడా డేంజర్ అని అన్నారు.
ఈ వ్యాఖ్యల కంటే ముందే నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తన ట్విట్టర్ అకౌంట్‌లో గవర్నర్ జగదీప్ ధన్కర్‌ను బ్లాక్(Twitter Account Block) చేసినట్టు వెల్లడించారు. కొన్నేళ్లుగా వీరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. కానీ, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రజాస్వామ్యానికి ఒక గ్యాస్ చాంబర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు వారి మధ్య విభేదాలను పరాకాష్టకు తీసుకెళ్లాయి. ఈ తరుణంలోనే సీఎం మమతా బెనర్జీ ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు.
‘నేను అడ్వాన్స్‌గా క్షమాపణలు చెబుతున్నాం. కానీ, ఆయన(జగదీప్ ధన్కర్) ప్రతి రోజూ ఏదో వంకతో మమ్మల్ని, మా అధికారులను దూషిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధమైన, అనైతికమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన సూచనలు చేయరు. ఏకంగా ఆదేశాలే ఇస్తుంటారు. ఎన్నుకున్న ప్రభుత్వమే వెట్టి కూలీగా మారింది. అందుకే నా ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆయనను బ్లాక్ చేశాను. ఈ వ్యవహారంతో నేను ఇర్రిటేట్ అవుతున్నాను’ సీఎం మమతా బెనర్జీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.