
భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఓ పోలీసు కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. అయితే ఆ పోలీసు కానిస్టేబుల్ అరెస్ట్ వెనక అతడి నాలుగేళ్ల కుమారుడి వాంగ్మూలం కీలకంగా మారింది. బాలుడి వాంగ్మూలం, పోస్టుమార్టమ్ నివేదిక ఆధారంగా పోలీసు కానిస్టేబుల్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాలు.. నిందితుడు Rinku Gautam పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య బ్రిజేష్ కుమారి, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే శుక్రవారం ఉదయం దుబగ్గ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి తన భార్య బ్రిజేష్ కుమారి ఆమె గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిందని చెప్పాడు.
దీంతో పోలీసులు గౌతమ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న బ్రిజేష్ కుమారి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని కిందకు దించి.. పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇందుకు సంబంధించి కుమారి తండ్రి Latori Ram పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గౌతమ్ కట్నం కోసం తన కూతురిని వేధించాడని.. ఈ క్రమంలోనే చిత్రహింసలకు గురిచేసి చంపాడని ఆరోపించారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే గౌతమ్ కొడుకు వద్ద నుంచి వివరాలు సేకరించారు. అయితే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో గౌతమ్ కొడుకు కీలక విషయాలు వెల్లడించాడు. ‘‘ నాన్న అమ్మను సోఫా పైకి నెట్టాడు. అమ్మను చెంపదెబ్బ కొట్టి.. మెడను గట్టిగా నొక్కాడు. అమ్మ ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నం చేసింది. తర్వాత నాన్న.. అమ్మ మెడను కట్టేసి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు’’ అని గౌతమ్ కొడుకు వాంగ్మూలం ఇచ్చాడని దుబగ్గ ఎస్‌హెచ్‌వో ప్రకాష్ సింగ్ తెలిపారు.
మరోవైపు ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గౌతమ్ కనిపించకుండా పోవడం అనుమానాలు వ్యక్తమయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు పోస్టుమర్టమ్ నివేదికలో కుమారిని గొంతు నులిమి హత్య చేసినట్టుగా నిర్దారణ అయిందని.. ఇది తమ అనుమానాన్ని బలపరిచిందని చెప్పారు. ఈ క్రమంలోనే గౌతమ్ ఆచుకీ కోసం గాలింపు చేపట్టగా.. ఇన్‌ఫార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు అతడు దాక్కున్న ప్రదేశానికి వెళ్లి అరెస్టు చేశామని తెలిపారు.