Mamata Banerjee: బెంగాల్ పరువు తీసేందుకు కుట్ర... బీజేపీ, సీపీఐ(ఎం)ల పై మమతా బెనర్జీ ఫైర్

Published : Apr 28, 2022, 12:01 AM IST
Mamata Banerjee: బెంగాల్ పరువు తీసేందుకు కుట్ర... బీజేపీ, సీపీఐ(ఎం)ల పై మమతా బెనర్జీ ఫైర్

సారాంశం

West Bengal: బెంగాల్ ప‌రువు తీసేందుకు కుట్ర జ‌ర‌గుతున్న‌ద‌ని ఆరోపించిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. బీజేపీ, సీసీఐ(ఎం)ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బెంగాల్ ను మ‌రో హత్రాస్ లేదా ఉన్నావ్‌గా మార్చనివ్వన‌ని ఆమె అన్నారు.  

Mamata Banerjee: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), సీపీఐ(ఎం) లపై బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌రోసారి ఫైర్ అయ్యారు. బెంగాల్ రాష్ట్ర ప‌రువు తీసేందుకు కుట్ర జ‌రుగుతున్న‌ద‌ని దీదీ ఆరోపించారు. ఏప్రిల్ 4న నదియా జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసు విష‌యం ఆమె మాట్లాడుతూ.. పై వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్ ను మ‌రో హత్రాస్ లేదా ఉన్నావ్‌గా మార్చనివ్వన‌ని ఆమె అన్నారు. “ఆత్మహత్య కేసును లైంగిక‌దాడి కేసుగా (రేప్ కేసు) మార్చారు. బీజేపీ, సీపీఐ(ఎం) రెండూ బెంగాల్‌ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. బెంగాల్‌ను హత్రాస్‌ లేదా ఉన్నావ్‌గా మార్చనివ్వము” అని ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. 

ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌నే ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. "ఇన్‌స్పెక్టర్ సరైన వాస్తవాలను ఎందుకు బయటపెట్టలేదు? ఇది అతని నిర్లక్ష్యం కారణంగా జరిగింది. మీ జిల్లాలో ఎంత మంది చనిపోయారో తెలియజేయాలి. పంచాయతీ సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. మేము చేయము. దాని గురించి కూడా నాకు తెలియదు”అని అన్నారు.  అంత‌కు ముందు కూడా ఈ కేసు విష‌యంలో మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దమ‌య్యాయి. “అసలు ఆమెపై అత్యాచారం జరిగిందా? ఆమె గర్భవతిగా ఉందా? మరేదైనా కారణం ఉందా? ఆమెను ఎవరైనా చెంపదెబ్బ కొట్టారా? ఆమె అనారోగ్యంతో ఉందా? ప్రేమ వ్యవహారం జరిగిందా.. అనే విషయాలు ఆమె కుటుంబీకులు, ఇరుగుపొరుగు వారికి కూడా తెలుసు. అబ్బాయిలు మరియు అమ్మాయిలు ప్రేమలో పడకుండా నేను ఆపలేను. ఇది ఉత్తరప్రదేశ్ కాదు. నేను లవ్ జిహాద్ కార్యక్రమాన్ని ప్రారంభించలేను. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం' అని ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పేర్కొన్నారు. 

కాగా, లైంగిక‌దాడికి గురై చ‌నిపోయిన ఘ‌ట‌న రాష్ట్రంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దానికి తెర‌లేపింది. ఈ నెల 4న న‌దియాలోని TMC పంచాయితీ సభ్యుడు సమరేంద్ర గయాలీ కుమారుడు బ్రజగోపాల్ పుట్టినరోజు పార్టీకి వెళ్ళినప్పుడు బాలిక సామూహిక అత్యాచారాని గురైంద‌నీ, ఈ క్ర‌మంలోనే అనారోగ్యానికి గురై ఒక‌రోజు త‌ర్వాత ప్రాణాలు కోల్పోయింద‌ని ఆరోప‌ణ‌లతో కేసు న‌మోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అదే రోజు రాత్రి అనారోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చింది. అధిక రక్తస్రావం కారణంగా ఒక రోజు తరువాత మరణించింది. మరణ ధృవీకరణ పత్రం లేకుండానే సాయంత్రం ఆమెను దహనం చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం TMC నాయకుడి కుమారుడు మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసాడు.. పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆమె మరణించిన కొన్ని రోజుల తర్వాత, బాలిక కుటుంబం TMC నాయకుడి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రధాన నిందితుడు బ్రజగోపాల్ మరియు అతని స్నేహితుడు ప్రభాకర్ పొద్దార్‌లను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయగా, సీబీఐ ఆదివారం మరో ముగ్గురిని అరెస్టు చేసింది. నిందితులు సూరజిత్ రాయ్, ఆకాష్ గరాయ్, దీప్తో గయాలీ సాక్ష్యాలను నాశనం చేసి,  బాధిత కుటుంబాన్ని బెదిరించార‌ని మ‌రో కేసు న‌మోదైంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?