చమురు ధరలపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన రాష్ట్రాలు

Published : Apr 27, 2022, 08:36 PM IST
చమురు ధరలపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన రాష్ట్రాలు

సారాంశం

చమురు ధరల పెరుగుదలకు ఆయా రాష్ట్రాలే కారణం అని, అవి చమురుపై పన్ను తగ్గించలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రాలు ఘాటుగా స్పందించాయి. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మోడీని నిలదీశాయి.  

న్యూఢిల్లీ: చమురు ధరలు పెరుగుదలపై ప్రధాని మోడీ ఈ రోజు ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో మాట్లాడారు. వాటిపై బీజేపీయేతర ప్రభుత్వాలు ఘాటుగా స్పందించాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు రియాక్ట్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపట్ల సవతి ప్రేమ తల్లిని చూపిస్తున్నదని ఆరోపణలు చేశాయి. ప్రధాని మోడీ ఆయనపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించడానికి ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాయి. ప్రధాని మోడీ చెప్పిన మాటలు అబద్ధాలని మండిపడ్డాయి.

చమురు ధరలు తగ్గకపోవడానికి కారణం రాష్ట్రాలేనని, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలు చమురు ధరలపై ట్యాక్స్ తగ్గించాయని, తద్వార అక్కడి ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారని వివరించారు. అదే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు మాత్రం చమురుపై పన్ను తగ్గించలేవని అన్నారు. ఆ రాష్ట్రాలు వెంటనే పన్ను తగ్గించాలని పేర్కొన్నారు.

కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, సహకార సమాఖ్యస్ఫూర్తి విలువలను నిలుపుకోవాలని వివరించారు. కాగా, ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను అపోజిషన్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు లైట్‌గా తీసుకోలేవు. ఏ రాష్ట్రం ఏం అన్నదో ఓ సారి చూద్దాం.

తెలంగాణ:

ఆయన తన ట్వీట్లను కేంద్ర ప్రభుత్వాన్ని నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్‌ (ఎన్‌పీఏ/ నిరర్ధక ఆస్తి)గా విమర్శిస్తూ మొదలు పెట్టారు. అసలు తాము వ్యాట్ పెంచనేలేదని, కానీ, పేరు పెట్టి మరీ ఈ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడే సహకార సమాఖ్యస్ఫూర్తి అంటే ఇదేనా? అంటూ ప్రధానిని ప్రశ్నించారు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం చమురుపై వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. కేవలం ఒకే సారి రౌండ్ ఆఫ్ చేశారని వివరించారు.

మరో ట్వీట్‌లో వన్ నేషన్ వన్ ప్రైస్? (ఒక దేశం - ఒకే ధర)ను అమలు చేయవచ్చు కదా? అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. చమురుపై హక్కుగా లభించే 41 శాతం వాటా తమకు లభించడం లేదని, కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్ వల్లే ఈ నష్టం తమకు  వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. సెస్ రూపంలో రాష్ట్రాల నుంచి కేంద్రం 11.4 శాతం వాటా కొట్టేస్తున్నదని, 2023 ఆర్థిక సంవత్సరంలో తమకు కేవలం 29.6 శాతం మాత్రమే దక్కుతున్నదని వివరించారు. దయచేసి సెస్‌ను ఎత్తేయండని కోరారు. తద్వార దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌ను రూ. 70కి, డీజిల్‌ను రూ. 60కి తాము అందించగలుగుతామని పేర్కొన్నారు. వన్ నేషన్ - వన్ ప్రైస్ సాధ్యం అవుతుంది కదా? అన్నట్టుగా ట్వీట్ చేశారు.

పశ్చిమ బెంగాల్:

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. కొవిడ్ సమావేశంలో చమురు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన తమను పన్నులు తగ్గించాలని కోరుతున్నాడని, కానీ, ఆయన మాత్రం పన్ను కొట్టేస్తారని ఆరోపించారు. ప్రధాని ప్రజలను తప్పదారి పట్టించేలా మాట్లాడారని, పన్నులు తగ్గించకుండా రాష్ట్రాలపై భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చమురుపై ఒకరూపాయి సబ్సిడీ ఇస్తున్నదని, మూడేళ్లలో తమకు రూ. 1500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. కానీ, దీన్ని ప్రధాని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. చమురుపై వచ్చిన రెవెన్యూను 50-50 చేసుకుందామంటే.. వారు అంగీకరించరని, 75 శాతం వారే తీసుకుని రాష్ట్రాలపై భారం మోపుతారని అన్నారు. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారని, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై మాత్రం సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారని ఆరోపించారు. 

తమిళనాడు:

తమిళనాడు అధికారపార్టీ డీఎంకే ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ, ముఖ్యమైన విషయం ఏంటంటే చమురుపై వసూలు చేసే సెస్ నుంచి రాష్ట్రానికి ఏమీ రాదని, అందుకే తాము దాన్ని వ్యాట్‌గా మార్చాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. కానీ, దాన్ని అంగీకరించలేదని  పేర్కొన్నారు. మరొక విషయం.. డీఎంకే ఇప్పటి వరకు ధరలు పెంచలేదని, పెట్రోల్ ధరను తాము రూ.3 తగ్గించామని తెలిపారు. పీఎం ఇలా జ్ఞానబోధ చేయడానికి బదులు వ్యాట్‌ను రాష్ట్రాలకు అందిస్తే చాలాని పేర్కొన్నారు. సెస్‌కు జవాబుదారీ లేదని, గడిచిన ఎనిమిదేళ్లలో కేంద్రం రూ. 26 లక్షల కోట్లు పొందిందని వివరించారు. ఈ డబ్బంతా ఎటు పోయిందని ప్రశ్నించారు. మోడీపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించడానికి ఆయన ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

మహారాష్ట్ర:

చమురు ధరల పెరుగుదలకు రాష్ట్రాలను బ్లేమ్ చేయరాదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. పీఎం మోడీని కోరారు. ‘ఈ రోజు ముంబయిలో లీటర్ డీజిల్‌పై రూ. 24.38 కేంద్రం తీసుకుంటే.. రాష్ట్రం 22.37 తీసుకుంటున్నది. అదే పెట్రోల్‌పై రూ. 31.58 సెంట్రల్ ట్యాక్స్, రూ. 32.55 స్టేట్ ట్యాక్స్‌గా ఉన్నది. కాబట్టి, కేవలం రాష్ట్రం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెప్పడం వాస్తవ విరుద్ధం’ అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్