అవినీతి ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను విచారించండి: సీబీఐకి కాంగ్రెస్ లేఖ

By Mahesh KFirst Published Mar 23, 2023, 4:11 PM IST
Highlights

మేఘాలయ ప్రభుత్వంపై ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఆ అవినీతి ఆరోపణలను విచారించడానికి అమిత్ షాకు సమన్లు పంపాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సీబీఐకి లేఖ రాశారు. 
 

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వం మేఘాలయాలోని కొన్రాడ్ సంగ్మా ప్రభుత్వమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేస్తూ.. దేశ ప్రయోజనాల కోసం ఈ అవినీతి ఆరోపణలపై కేంద్ర మంత్రిని సీబీఐ ప్రశ్నించాలని కాంగ్రెస్ లేఖ రాసింది. కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రశ్నించాలని తాను సీబీఐకి లేఖ రాసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. అంతటి తీవ్ర ఆరోపణలు చేసిన ప్రభుత్వాన్నే ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ సపోర్ట్ చేసిందని పేర్కొన్నారు. 

అమిత్ షా దేశానికి హోం మంత్రి అని, కాబట్టి, ఎన్నో విషయాలు ఆయన దృష్టికి వచ్చిన తర్వాతే బహుశా కొన్రాడ్ సంగ్మా ప్రభుత్వం అత్యంత అవినీతికర ప్రభుత్వమనే నిర్దారణకు ఆయన వచ్చి ఉంటాడని జైరాం రమేశ్ తెలిపారు. బయటికి చెప్పలేని కారణాల రీత్యా ఆయన మేఘాలయ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తునకు ఆదేశించి ఉండకపోవచ్చని వివరించారు.

కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా అమిత్ షాకు సమన్లు పంపి, ఆయనను ప్రశ్నించాల్సిందిగా సీబీఐని కోరుతన్నట్టు మార్చి 21వ తేదీన రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ అవినీతి ఆరోపణల తర్వాత ఎన్నికల ఫలితాల అనంతరం అదే కొన్రాడ్ సంగ్మా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు పలికిందని తెలిపారు. కాబట్టి, ఆ అవినీతి ఆరోపణలపై విచారణ జరపకుండా బీజేపీ నుంచి ఆయనపై ఏమైనా ఒత్తిడి ఉన్నదేమో కూడా విచారించాలని ఆయన సీబీఐని కోరారు. ఆ లేఖకు అమిత్ షా చేసిన కామెంట్లకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్‌లనూ జత చేశారు.

Also Read: బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలి: మెహబూబా ముఫ్తీ

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగడానికి ముందు అక్కడ ప్రచారం చేస్తూ అమిత్ షా అప్పటి వరకు బీజేపీ మద్దతు ఇచ్చిన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని అవినీతి కేసులపై సుప్రీంకోర్టు జడ్జీ సారథ్యంలో ఓ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నవారిని ఊచల వెనక్కి పంపిస్తామని వివరించారు. కొన్రాడ్ సంగ్మా ప్రభుత్వం హయాంలో ఎలక్ట్రిసిటీ డిస్కమ్‌లు సంక్షోభంలో పడిపోయాయని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వల్లే అని ఆరోపించారు.

click me!