
పంజాబ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తరువాత ఓ కాంగ్రెస్ కార్యకర్తపై దాడి జరిగింది. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అతడు అప్పటి నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన మృతి చెందాడు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ న్యాయం ఆలస్యమైతే అది తిరస్కారమే అవుతుంది. దోషులను (ఆప్ గూండాలు) వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి ’ అని సిద్దూ అన్నారు. కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మనీష్ తివారి డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ మంత్రి పర్గత్ సింగ్ కూడా స్పందించారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని సీఎం భగవంత్ మాన్ ను కోరారు. “ మార్చి 12వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కసోనా (పోలీస్ స్టేషన్ జిరా) గ్రామంలోని దళితుడైన కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ సింగ్ హత్య జరిగింది. అయితే ఈ హత్యాకాండకు నాయకత్వం వహించిన ముగ్గురు నిందితులు AAP పంజాబ్ కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని నేను సీఎం భగవంత్‌మాన్ కి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధితుడు ఈ రోజు మృతి చెందారు. కానీ నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలాంటి మార్పు కోసం పంజాబ్ ప్రజలు ఓటు వేయలేదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా మరో వైపు ఆప్ నేత మల్వీందర్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. కాగా ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి పేరు ఇక్బాల్ సింగ్. ఈయన కాంగ్రెస్ కార్యకర్త. కస్సోనా గ్రామానికి చెందిన వ్యక్తి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈయనపై ముగ్గురు వ్యక్తులు ఇటుకలతో దాడి చేశారు.
ఇటుకల దాడిలో గాయపడిన 53 ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్త ఫరీద్‌కోట్‌లోని గురుగోవింద్ సింగ్ మెడికల్ కాలేజీలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. మృతుడి సోదరుడు పాల్ సింగ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా మార్చి 13న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుదిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.