ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఫలితాలపై పోస్ట్‌మార్టం చేయనున్న కాంగ్రెస్.. రేపు సీడబ్ల్యూసీ మీటింగ్

Siva Kodati |  
Published : Mar 12, 2022, 04:43 PM IST
ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఫలితాలపై పోస్ట్‌మార్టం చేయనున్న కాంగ్రెస్.. రేపు సీడబ్ల్యూసీ మీటింగ్

సారాంశం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఫలితాలపై విశ్లేషణ  మొదలెట్టింది. దీనిలో భాగంగా రేపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సోనియా, రాహుల్, మన్మోహన్ సహా పలువురు కీలక నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు. 

ఐదు రాష్ట్రాలకు (ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్) జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరుగనుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.

అంతకంటే ముందు… కాంగ్రెస్ లో అసంతృప్త నేతలుగా (గ్రూప్ 23)ముద్ర పడిన కొందరు.. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం, ఇతరత్రా అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సీనియర్ నేతలు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారి తదితరులు హాజరయ్యారు. ఫలితాలతో తాను దిగ్భ్రాంతికి గురైనట్లు, ఇలా పతనం అవుతుండడం చూడలేకపోతున్నా అంటూ… గులాంనబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధినాయకత్వం గమనించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు ఆజాద్ వెల్లడించారు. మరికొంత మంది నేతలు కూడా ఆయనతో ఏకీభవించారు.

మరోవైపు..ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని ఇతర పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీని ఎలాగైనా ఎదుర్కోవాలని ఎన్నో రోజులుగా కాంగ్రెస్ చేస్తోన్న ప్రయత్నాలన్నీ తాజా ఎన్నికల ఫలితాలతో బెడిసికొట్టినట్లయ్యింది. 2014 నుంచి దేశంలో 45 సార్లు ఎన్నికలు జరిగితే హస్తం పార్టీ కేవలం నెగ్గింది ఐదు మాత్రమే. ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం, అంతర్గత కలహాలు, నేతల మధ్య అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్ పతనానికి కారణమౌతున్నాయి.

దీంతో 23 మంది పార్టీ సీనియర్ నేతలు నేరుగా అధిష్టానికి ఓ లేఖ రాయడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంతో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. జీ 23గా పేరు పెట్టి.. అందులో ఉన్న నేతలను వేరుగా చూడడం ప్రారంభించింది. నానాటికి పార్టీ ప్రతిష్ట దిగజారుతుండడం, సీనియర్లను పక్కకు పెట్టి యువ రక్తానికి అవకాశం కల్పించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

కాగా.. 403 స్థానాలున్న యూపీలో 02 సీట్లు, 117 సీట్లున్న పంజాబ్ రాష్ట్రంలో 18, 70 సీట్లున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 సీట్లు, గోవాలో 20 సీట్లుంటే.. 12, మణిపూర్ లో 60 అసెంబ్లీ సీట్లుంటే 06 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?