అదానీ గ్రూప్ స్కామ్ .. నిజాలు నిగ్గు తేల్చండి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు

By Siva KodatiFirst Published Feb 6, 2023, 6:24 PM IST
Highlights

అదానీ గ్రూప్ స్కాంపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. ఎల్ఐసీ, ఎస్‌బీఐ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగింది.ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో పలు ప్రాంతాల్లో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. 

అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రిపోర్ట్ వెలుగులోకి వచ్చిన 12 రోజుల తర్వాత కూడా సెగలు చల్లారడం లేదు. హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబడుతూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి విపక్షాలు. దీంతో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చాలని దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది కాంగ్రెస్ పార్టీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రోడ్డెక్కాయి కాంగ్రెస్ శ్రేణులు. కేంద్ర ప్రభుత్వం తన సన్నిహితులకు సాయం చేసేందుకు సామాన్యుల సొమ్ము వినియోగిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎల్ఐసీ, ఎస్‌బీఐ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అదానీ వ్యవహరంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో పలు ప్రాంతాల్లో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. 

హిండెన్ బర్గ్ ప్రశ్నలకు 413 పేజీల రిప్లై ఇచ్చిన అదానీ గ్రూపు:

స్టాక్ మార్కెట్‌లో జరిగిన మోసాలపై నివేదికను విడుదల చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్పందించింది. అదానీ గ్రూప్ 413 పేజీల రిప్లై ఇచ్చింది. పబ్లిక్‌గా లభ్యమయ్యే సమాచారాన్ని హిండెన్‌బర్గ్ తప్పుగా సూచించారని కంపెనీ ఆరోపించింది. 

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 88 ప్రశ్నలలో, 68కి సంబంధిత కంపెనీలు తమ వార్షిక నివేదికలలో సమాధానాలు ఇచ్చాయి, మిగిలిన 20లో 16 వాటాదారుల రాబడికి సంబంధించినవి, 4 ప్రశ్నలు పూర్తిగా అర్ధంలేనివని అదానీ గ్రూపు తోసిపుచ్చింది. కోర్టు నిర్ణయించిన కేసులను కొత్త అభియోగాలుగా సమర్పించారని తెలిపింది. విదేశాల్లో షెల్ కంపెనీల ఆరోపణ తప్పని తెలిపింది. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్న చట్టం గురించి కూడా నివేదిక తయారు చేసిన వారికి తెలియదని నివేదిక పేర్కొంది.

ALso REad: అదానీ గ్రూపును ఒక్క దెబ్బతో కుదేలు చేసిన హిండెన్ బర్గ్ వెనకున్న మాస్టర్ మైండ్ నాథన్ ఆండర్సన్ చరిత్ర ఇదే..

దీనితో పాటు, భారతీయ సంస్థలు, న్యాయవ్యవస్థలోకి హిండెన్‌బర్గ్ చొరబాటును అదానీ గ్రూప్ విమర్శించింది. రేపటి నుంచి మార్కెట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అదానీ గ్రూప్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగ్షీందర్ సింగ్ కూడా వివరణాత్మక ఛానెల్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

హిండెన్ బెర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ చేసిన అక్రమాలపై తన నివేదిక చివరిలో 88 ప్రశ్నలను లేవనెత్తింది. అయితే నివేదిక వెలువడి రెండ్రోజులు గడిచినా ఈ ప్రశ్నలకు అదానీ గ్రూప్ స్పందించలేదు. హిండెన్‌బర్గ్ నివేదికలను తిరస్కరిస్తూ అదానీ గ్రూప్ పత్రికా ప్రకటన విడుదల చేసింది, కానీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు. హిండెన్‌బర్గ్ చట్టపరమైన చర్యను తీసుకోనున్నట్లు తెలిపారు. 

click me!