క్షీణించిపోయిన ఖజానాను నింపుకోవడానికి సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ (congress party) ప్రజల నుంచి విరాళాలు కోరుతోంది. ఆ పార్టీ 138 వార్షికోత్సవం (congress 138 foundation day) సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ క్యాంపెయిన్ కు ‘డొనేట్ ఫర్ దేశ్’ (Donate for Desh) అనే పేరు పెట్టింది.
Donate for Desh : దేశంలోనే అతిపురాతన పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల నుంచి ఆర్థిక సాయం కోరుతోంది. క్షీణించిన ఖజానాను నింపుకునేందుకు ఆ పార్టీ క్రౌడ్ ఫండింగ్ మార్గాన్ని ఎంచుకుంది. సహాయ నిరాకరణోద్యమానికి నిధుల సమీకరించుకునేందుకు మహాత్మాగాంధీ కూడా 'తిలక్ స్వరాజ్ ఫండ్' పేరుతో సాయం కోరారు. లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో గాంధీ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం కోసం క్యాంపెయిన్ ప్రారంభించనుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ - మేలో రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందు గాంధీజీ 'తిలక్ స్వరాజ్ ఫండ్' తరహాలో ‘డొనేట్ ఫర్ దేశ్’(దేశ్ కోసం విరాళం) అనే క్రౌడ్ ఫండింగ్ ను కాంగ్రెస్ ప్రకటించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో డొనెట్ చేసే అవకాశం ఉన్న ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిసెంబర్ 18న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ శనివారం మీడియా ఎదుట వెల్లడించారు.
‘డొనేట్ ఫర్ దేశ్’ కార్యక్రమం ఒక అంబ్రెల్లా ఉద్యమం అని, దీని కింద వరుస ప్రచారాలు చేపడతామని మాకెన్ చెప్పారు. వీటిలో మొదటిది కాంగ్రెస్ 138వ వార్షికోత్సవం సందర్భంగా విరాళాల సేకరణ అని చెప్పారు. కాంగ్రెస్ 138 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ బలోపేతానికి రూ.138, రూ.1,380, రూ.13,800 వంటి మొత్తాలను కాంగ్రెస్ ఖాతాలో జమ చేయాలని, తద్వారా మెరుగైన భారతదేశం కోసం కాంగ్రెస్ పనిచేయగలదని మాకెన్ అన్నారు.
The Indian National Congress is proud to announce the launch of its online crowdfunding campaign, 'Donate for Desh'. This initiative is inspired by Mahatma Gandhi ji's historic 'Tilak Swaraj Fund' in 1920-21 and aims to empower our party in creating an India rich in equal… pic.twitter.com/14pH4xkcYS
— Congress (@INCIndia)‘‘మా ప్రారంభ ప్రచారం కాంగ్రెస్ 138 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. మెరుగైన భారతదేశం కోసం పార్టీ శాశ్వత నిబద్ధతకు చిహ్నంగా రూ .138, రూ .1380, రూ .1380, రూ .13,800 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో విరాళం ఇవ్వలాని మేము మా మద్దతుదారులను ఆహ్వానిస్తున్నాము’’అని కెసి వేణుగోపాల్ అన్నారు. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు కనీసం రూ.1,380 చొప్పున విరాళం ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 వరకు ఈ ప్రచారం ఆన్ లైన్ లో ఉంటుందని, ఆ తర్వాత వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రతి బూత్ లో కనీసం పది ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కనీసం రూ.138 విరాళాలు ఇవ్వాలని కోరుతారని చెప్పారు. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ కోసం www.donateinc.in, www.inc.in అనే రెండు ఛానళ్లను రూపొందించామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు మాత్రమే పార్టీకి విరాళాలు ఇవ్వడానికి అర్హులని ఆయన అన్నారు. వారికి డొనేషన్ సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవం 138వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 28న నాగ్ పూర్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. కాగా.. 2022 మేలో ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ సందర్భంగా కొందరు ప్రతినిధుల ఈ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ ఆలోచనను అమలు చేస్తోంది.