
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నేత గాంధీల అభిప్రాయాలను వినాల్సిందే అని పి చిదంబరం అన్నారు. అలాగే, పార్టీకి గాంధీయేతర అధ్యక్షుడు ఎన్నికైనప్పటికీ గాంధీలే పార్టీ వ్యవహారాలు నడుపుతారని, కొత్త చీఫ్ వారి చేతిలో రిమోట్‌గా ఉంటే వారు కంట్రోల్ చేస్తారనే వాదనలను తిప్పికొట్టారు. అవన్నీ కేవలం ఊహాగానాలే అని వివరించారు.
గాంధీల గళం కుంటుపడుతుందని ఎవరూ చెప్పడం లేదు అని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. కొత్త అధ్యక్షుడు కూడా గాంధీల అభిప్రాయాలు వినాల్సే ఉటుందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు, ఇతర పార్టీ ఫోరమ్స్‌లలోనూ వారి అభిప్రాయాలు ఇతరులతోపాటు వినాల్సే ఉంటుంది కదా అని వివరించారు.
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోలింగ్ జరిగింది. ఈ పోస్టు కోసం మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్‌లో సుమారు 9 వేల ప్రతినిధులు ఓట్లు వేశారు. గాంధీలు ఈ పోటీలో లేకున్నా.. మల్లికార్జున్ ఖర్గేను గాంధీలు ఎంచుకున్న నేతగానే చాలా మంది చూస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత కూడా పార్టీలో విప్లవాత్మక మార్పులేమీ ఉండబోవని చాలా మంది అనుకుంటున్నారు.
Also Read: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక.. ముగిసిన పోలింగ్.. 19వ తేదీన తేలనున్న ఫలితం..
అయితే, కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన చేయాలని, వ్యవస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన వారిలో పి చిదంబరం కూడా ఉన్నారు.
గాంధీ రిమోట్ కంట్రోల్ అనే వాదనలపైనా పి చిదంబరం మాట్లాడారు. గాంధీల చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంటుందనేది కేవలం ఒక ఊహ మాత్రమే అని ఆయన అన్నారు. ఎన్నికలు నిర్వహించి జిల్లా స్థాయిలో కొత్త నేతలను ఎన్నుకున్న తర్వాత కూడా వారే రిమోట్ కంట్రోల్ చేస్తారని ఊహించగలమా? అని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న వ్యక్తి వెంటనే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.
పార్టీ ద్వారానే రాజకీయ వేడిని పెంచగలమని, ఇందుకు సరైన పార్టీ నిర్మాణం ఉండాలని వివరించారు. 15 నెలల్లో ఈ పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.