ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ భావిస్తున్నదని, తద్వార మోడీకి ఆర్థిక గణాంకాల రూపంలో చెక్ పెట్టాలని అనుకుంటున్నట్టు తెలిసింది. అయితే, రఘురామ్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారా? పెద్దల సభలో అడుగు పెడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపించాలని అనుకుంటున్నదా? తద్వార కాంగ్రెస్ కూటమి సుస్థిరంగా ఉన్నదనే సంకేతాలు పంపాలని తలచిందా? అంటే.. రాజకీయ వర్గాల్లో ఔననే చర్చ జరుగుతున్నది. కానీ, రఘురామ్ రాజన్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు.
ఈ నెలాఖరులో రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లోనే రఘురామ్ రాజన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ లేదా మహావికాస్ అఘాదీ అభ్యర్థిగా రఘురామ్ రాజన్ పోటీ చేస్తారని, ఆయనను రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వస్తున్నాయి.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్లేట్ ఫిరాయించడం, టీఎంసీ, ఆప్ తలోదారి చూసుకోవడంతో ఇండియా కూటమికి తెరపడిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే, కూటమి ఎప్పటిలాగే సుస్థిరంగా ఉన్నదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో రఘురామ్ రాజన్‌ను మహారాష్ట్రలోని మహావికాస్ అఘాదీ పంపించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీనితోపాటు మోడీ ప్రభుత్వంపై ఆయన పలుమార్లు విరుచుకుపడ్డారు. ఆర్థికంగా లెక్కలతో సహా వివరించి అధికార పార్టీని ఇరుకున పెట్టగల సత్తా ఆయనకు ఉన్నదని భావిస్తున్నది. అందుకే రఘురామ్ రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
Also Read : Lok Sabha Seat: టికెట్ల కోసం సీనియర్ల ఆరాటం.. కాంగ్రెస్ హైకమాండ్ పై పెరుగుతున్న ఒత్తిడి
ఈ ప్రచారంపై పార్టీల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ, రఘురామ్ రాజన్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, తాను ఏ పార్టీతోనూ సంప్రదింపులు జరపలేదని స్పష్టత ఇచ్చారు. రఘురామ్ రాజన్ ఖండించినప్పటికీ ఈ ప్రచారం మాత్రం సాగుతూనే ఉన్నది.
2013 నుంచి 2016 వరకు రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేంద్రంపై రఘురామ్ రాజన్ పలుమార్లు సీరియస్ కామెంట్లు చేశారు.