Amnesia Pub Rape Case : ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం.. మహిళా లోకం కదలాలంటూ పిలుపు...

By SumaBala Bukka  |  First Published Jun 4, 2022, 9:48 AM IST

శుక్రవారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ అమ్నీషియా పబ్ లో మైనర్ రేప్ ఘటన మీద ములుగు  ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. 


ములుగు : హైదరాబాద్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా లోకం కదలాలి అన్నారు. నిందితులకు శిక్షపడేవరకు పోరాడాలని... మనల్ని మనం రక్షించుకుందాం అంటూ సీతక్క పిలుపునిచ్చారు. 

కాగా రాజధాని నగరంలో శుక్రవారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్లో పరిచయమైన ఒక బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు, వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా చైర్మన్ గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతని స్నేహితులు ఉన్నారు. వీరిలో ఒక బాలుడిని, సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడిని  పోలీసులు అరెస్టు చేశారు. ఆరు రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకోగా… భయంతో  బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు.   

Latest Videos

undefined

ఆమె శరీరంపై గాయాలు చూసి… తండ్రి ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక షాక్ నుంచి తేరుకున్నాక… భరోసా కేంద్రంలో మహిళా పోలీసులు బుధవారం రాత్రి ఆమెతో అనునయంగా మాట్లాడటంతో వాస్తవం బయటికొచ్చింది. తనపై కొందరు సామూహిక అత్యాచారం చేశారంటూ ఆమె విలపించింది. దీంతో పోలీసులు అత్యాచారం సెక్షన్లు జోడించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రజాప్రతినిధుల సంతానమైనందునే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ ఠాణా వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా చేశారు. 

మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ కూడా నిందితుల్లో ఉన్నాడంటూ ప్రచారం అవగా, తనకు సంబంధం లేదంటూ పుర్ఖాన్  ఖండించారు. అసలేం జరిగిందంటే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని అమ్నీషియా పబ్ లో మే 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు ఒక బృందం నాన్ లిక్కర్ ఈవెంట్ను నిర్వహించింది.  ఇందులో 150 మంది పాల్గొన్నారు. వీరిలో 80 శాతానికి పైగా మైనర్లు. వారిలో ఒక బాలిక పబ్ లో పరిచయమైన స్నేహితులతో సరదాగా గడిపింది. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక బాలుడు(16), మిగిలిన స్నేహితులతో కలిసి కిందకు వచ్చింది. వారిలో ప్రభుత్వ సంస్థ చైర్మన్ కుమారుడు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరికొందరు ఉన్నారు. 

వారు బాలికను బెంజ్ కారులో ఎక్కించుకుని..బంజారాహిల్స్లోని ఓ బేకరీ వద్దకు వెళ్లారు. అక్కడ అరగంటపాటు సరదాగా గడిపారు. వేరే కారులో ఇంట్లో దింపుతామని ప్రభుత్వ సంస్థ చైర్మన్ కుమారుడు బాలికకు చెప్పాడు. ఆమెను వెంటబెట్టుకుని ఆరున్నర గంటల ప్రాంతంలో అతడు మరో ఐదుగురు ఇన్నోవా వాహనంలో బయల్దేరాడు. మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. మిగిలిన ఐదుగురు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. తర్వాత నిందితులు బాధితురాలిని ఆమ్నీషియా పబ్ వద్ద దింపేసి వెళ్లారు. 

బాలిక కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉండగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె తన తండ్రికి ఫోన్ చేసింది. ఆయన పబ్ వద్దకు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు. మెడపై గాయాలను గుర్తించి ప్రశ్నించిన ఆమె సమాధానం చెప్పలేదు. అనుమానంతో తండ్రి మే 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ  బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సంబంధిత సెక్షన్ల జోడించారు.

click me!