టీ షర్ట్ , జీన్స్ ధరించి అసెంబ్లీకి ఎమ్మెల్యే: బయటకు పంపిన స్పీకర్

By narsimha lodeFirst Published Mar 15, 2021, 7:36 PM IST
Highlights

టీ షర్ట్, జీన్స్ ధరించి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేను అసెంబ్లీ నుండి బయటకు పంపారు స్పీకర్, ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 
కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్‌ చూడసమా జీన్స్‌, టీషర్ట్‌ ధరించి రావడంతో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపారు.


గాంధీనగర్: టీ షర్ట్, జీన్స్ ధరించి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేను అసెంబ్లీ నుండి బయటకు పంపారు స్పీకర్, ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 
కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్‌ చూడసమా జీన్స్‌, టీషర్ట్‌ ధరించి రావడంతో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపారు.

గుజరాత్‌లోని సోమనాథ్ నియోజకవర్గం నుండి విమల్ చూడసమా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బ్లాక్ కలర్‌ టీషర్ట్‌ ధరించి అసెంబ్లీకి ఆయన అసెంబ్లీకి వెళ్లారు.
 స్పీకర్ రాజేంద్ర త్రివేది ఎమ్మెల్యే డ్రస్‌ చేసుకున్న విధానంపై అభ్యంతరం చెప్పడంతో సభలో రగడ మొదలైంది. 

టీషర్ట్‌ ధరించి అసెంబ్లీకి రావొద్దనే చట్టాలేమైనా ఉన్నాయా..? ఉంటే అవి సభ ముందుకు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే పట్టుబట్టడంతో స్పీకర్‌ ఆయనను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. తక్షణమే ఈ చర్య అమల్లోకి రావాలని స్పీకర్‌ ఆదేశించడంతో సదరు ఎమ్మెల్యేను సభ నుంచి బయటకు పంపించేశారు. 

కాగా, సభలో సభ్యులు సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండే దుస్తులు ధరించి అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్‌ రాజేంద్ర త్రివేది బడ్జెట్ సమావేశాల తొలిరోజునే సభ్యులకు సూచించారు. 

అయితే, స్పీకర్‌ సూచనలను పక్కనపెట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టీషర్ట్‌, జీన్స్‌ ధరించి సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కలుగజేసుకుని ఎమ్మెల్యే సభ గౌరవాన్ని కాపాడేలా దుస్తులు ధరించి రావడం మంచిదని హితవు పలికారు.


 

click me!