బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ చెక్?.. కాంగ్రెస్‌లో ఒక్కటవుతున్న ఆ సామాజిక వర్గం.. హస్తం విజయానికి కీలక అడుగులు!

Published : Jun 18, 2023, 05:30 PM IST
బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ చెక్?.. కాంగ్రెస్‌లో ఒక్కటవుతున్న ఆ సామాజిక వర్గం.. హస్తం విజయానికి కీలక అడుగులు!

సారాంశం

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. చేరికలు, ప్రచారాలు, వ్యూహాలు అన్నీ వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ సారి బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌కు మధ్య రసవత్తర పోరు సాగుతుందనే వాదనలు ఈ నేపథ్యంలో వినిపిస్తున్నాయి. అంతేకాదు, రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపుగా కేంద్రీకృతమవుతున్నదని, వారి వెంటే ఆ సామాజిక వర్గ ఓటర్లు కూడా కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపితే.. తెలంగాణలో హస్తం విజయం తథ్యం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

T Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్‌కు బలమైన పోటీ కాంగ్రెస్ నుంచే వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో హస్తం విజయం ఆ పార్టీలో నూతన జవసత్వాలను నింపింది. దీనికితోడు కాంగ్రెస్‌లో మరో శుభ పరిణామం కనిపిస్తున్నది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు.

స్వతంత్ర భారత్‌ను అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్‌కు సాంప్రదాయ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అందులో బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనులు, మైనార్టీల వరకు అన్ని వర్గాలు ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్‌ బేస్‌లోనూ ఈ సరళినే చూడవచ్చు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీకి అతిపెద్ద బలం రెడ్డి సామాజిక వర్గం. తొలినాళ్ల నుంచి వాళ్లు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వెంటే ఉన్నారు. కానీ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వారు కొంత ఎడంగా జరిగారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మార్పు కనిపించింది. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ తెలంగాణ రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత మేరకు ప్రభావితం చేసింది. జగన్ కూడా ఆ వర్గాన్ని కేసీఆర్ వైపు మలిచేలా పని చేశారు. కారు గుర్తుకే ఓటేయాలని జగన్ పలుమార్లు తెలంగాణలో ప్రచారం చేశారు. ఈ ప్రచార ప్రభావంతో రెడ్డి వర్గంలోని చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు కారు గుర్తుకు పడ్డాయి. కానీ, ఇప్పుడు జగన్ ప్రభావం తెలంగాణలో దాదాపు శూన్యం. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎటు వైపు ఉన్నదనేది పరిశీలిస్తే మనకు ఓ విషయం అర్థం అవుతుంది. వారు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపుతన్నట్టు అవగతమవుతుంది.

Also Read: కేసీఆర్, ఓవైసీల ఫ్రెండ్షిప్ వెనుక లెక్కలు ఇవే.. ముస్లిం ఓట్లతో ఆ పార్టీకి చెక్?

కాంగ్రెస్‌లో చేరికల అంశమూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కేఎల్ఆర్ అలియాస్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వంటి రెడ్డి సామాజిక నేతలు క్రియాశీలకంగా మారారు. వారు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారు. ఈ ధోరణి ఎన్నికల సమీపిస్తున్న కొద్ది మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది రెడ్డి సామాజిక వర్గ నేతలు టీ కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ రాజకీయశ్రేణుల్లో జరుగుతున్నది.

రెడ్డి సామాజిక వర్గం పార్టీలకు ముఖ్యమైన బలం. తెలంగాణలో ఈ సామాజిక వర్గానికి ఆర్థిక, రాజకీయాల్లో ఆధిపత్యంలో ఉన్నారు. ఓటర్లు కూడా ఈ సామాజికవర్గంలో చాలా మంది ఉంటారు. రెడ్డి నేతల వెంటే ఆ సామాజిక వర్గ ఓటర్లు కూడా కాంగ్రెస్‌ను విశ్వసిస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల మాట. ఎన్నికల సమాయానికి రాజకీయ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్