మణిపుర్‌ ఘటన గురించి ఇప్పుడు తెలిసిందా?: ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ లీడ‌ర్ ప్రియాంక గాంధీ ఫైర్

Congress Jan Akrosh rally: మణిపూర్ ప‌రిస్థితుల‌పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ లో జరిగిన ఘోరాన్ని ఖండించడంలో కూడా ప్రధాని రాజకీయాలను పక్కన పెట్టలేకపోయారని అన్నారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న‌ జరిగితే 77 రోజుల తర్వాత ప్రధాని స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు.
 

Google News Follow Us

Priyanka Gandhi Vadra: మ‌ధ్యప్ర‌దేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన 'జన్ ఆక్రోష్' ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని, బీజేపీని టార్గెట్ చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మధ్యప్రదేశ్ లో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ మార్పును కోరుకుంటున్నార‌ని తెలిపారు. మణిపూర్ ప‌రిస్థితుల‌పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ లో జరిగిన ఘోరాన్ని ఖండించడంలో కూడా ప్రధాని రాజకీయాలను పక్కన పెట్టలేకపోయారని అన్నారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న‌ జరిగితే 77 రోజుల తర్వాత ప్రధాని స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. మ‌ణిపూర్ మండిపోతున్న తీరు ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించ‌లేదా? మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా మార్చిన‌ అమాన‌వీయంగా దారుణ ఘ‌ట‌న‌ గురించి ఇప్పటి వరకు తెలియలేదా? అంటూ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

కాగా, ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. గ్వాలియర్ లో జరిగిన 'జన్ ఆక్రోష్' ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలను ప్ర‌స్తావించారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ప్ర‌ధాని మోడీ పై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. మన రాజకీయ నాయకుల్లో నాగరికత, నిరాడంబరత, సత్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారనీ, రాజకీయ నాగరికతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. రెండు రోజుల క్రితం ప్రతిపక్షాల భారీ సమావేశం జరిగిందనీ, ఈ క్ర‌మంలో ప్రతిపక్ష నేతలు, పార్టీలన్నీ దొంగలేనని ప్రధాని ప్రకటన చేశారంటూ మండిప‌డ్డారు. దేశం కోసం జీవితాంతం పోరాడిన, దేశంలో గౌరవం ఉన్న, ప్రజల సమస్యలను లేవనెత్తి రాజకీయాల్లో ఎదిగిన సీనియర్ నాయకులను ప్రధాని అవమానించారని ఆమె అన్నారు.

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియోను ప్రస్తావిస్తూ "మణిపూర్ రెండు నెలలుగా కాలిపోతోంది, ఇళ్లకు నిప్పుపెట్టారు, మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. పిల్లల తలల‌పై పైకప్పు లేదు. మన ప్రధాని మోడీ 77 రోజులుగా ఎటువంటి ప్రకటన చేయలేదు. చర్యలు తీసుకోవడం మర్చిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓ భయంకరమైన వీడియో వైరల్ కావడంతో ఆయన నిన్న బలవంతంగా మాట్లాడారు" అంటూ విమ‌ర్శించారు. ఆ ప్రకటనలో కూడా ఆయన రాజకీయాలనే ప్ర‌స్తావించార‌నీ, ఆయన తన ప్రకటనలో ప్రతిపక్షాల పేర్లను కూడా ప్రస్తావించ‌డంపై మండిప‌డ్డారు. ప్రజలకు దగ్గరగా ఉన్న సమస్యలపై మాట్లాడేందుకు తాను ర్యాలీకి వచ్చాననీ, దృష్టి మరల్చడానికి కాదంటూ.. నిత్యావ‌స‌రాల‌ ధరల పెరుగుదల, మహిళలపై దాని ప్రభావం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో మధ్యప్రదేశ్ లో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి. ఇది సిగ్గుచేటని ఆమె అన్నారు. దేశ సంపదను కొందరు వ్యాపారవేత్తలకు కట్టబెడుతున్నారని ఆమె ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణంగా సమాజంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయ‌ని అన్నారు. ఉద్రిక్తతలు పెరిగినప్పుడు అరాచకాలు పెరుగుతాయనీ, బలహీనంగా ఉన్నవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులను ఆమె ప్రస్తావించారు. మహిళల గురించి కూడా మాట్లాడొద్దని, ప్రతిరోజూ అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. దతియాలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో అరెస్టయిన బీజేపీ నేత కుమారుడిపై ఇటీవల వచ్చిన ఆరోపణను ప్రియాంక ప్రస్తావించారు.

Read more Articles on