కాంగ్రెస్, రాహుల్ గాంధీలకే కోవిడ్ నిబంధనలా .. బీజేపీ నేతలకు వద్దా : కేంద్ర మంత్రికి పవన్ ఖేరా కౌంటర్

By Siva KodatiFirst Published Dec 21, 2022, 3:34 PM IST
Highlights

రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లేఖ రాయడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ నేతలకు కరోనా నిబంధనలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. 

చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నందున భారత ప్రభుత్వం అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచించింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా బదులిచ్చింది. జన్ ఆకర్ష్ యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియాకు ఇలాగే లేఖ రాయగలరా అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయాను ప్రశ్నించారు. రాజస్థాన్, కర్ణాటకలలో బీజేపీ చేపట్టిన యాత్రలకు పెద్ద జనాకర్షణ లేదంటూ ఆయన చురకలంటించారు. 

కేవలం రాహుల్‌కి మాత్రమే లేఖ రాయడం అంటే.. భారత్ జోడో యాత్రను టార్గెట్ చేసుకోవడమేనని పవన్ ఖేరా ఆరోపించారు. దేశంలో అసలు కోవిడ్ నిబంధనలు అమల్లో వున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఏ విమానాశ్రయానికైనా వెళ్లి చూడాలంటూ చురకలంటించారు. మాస్క్ ఎవరూ అడగటం లేదని, ప్రజా రవాణా వ్యవస్థలో నిబంధనలు కఠినతరం చేయడం లేదని పవన్ ఖేరా ప్రశ్నించారు. కేవలం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్‌కు ఈ నిబంధనలు ఎందుకు అని ఆయన నిలదీశారు. 

ALso REad: కోవిడ్ రూల్స్ పాటించండి.. లేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయండి: రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి లేఖ

కాగా... ప్రపంచంలోని పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీచేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడూ గుర్తించేందుకు పాజిటివ్ నమునాలను పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే తాజాగా భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా లేఖ రాశారు.

రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు పీపీ చౌదరి, నిహాల్ చంద్, దేవ్‌జీ పటేల్ కరోనా వ్యాప్తిపై లేవనెత్తిన ఆందోళనల దృష్ట్యా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఈ లేఖలో మంత్రి మన్సుఖ్ మాండవీయా సూచించారు. మాస్క్‌లు, శానిటైజర్‌ వినియోగించాలని.. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు మాత్రమే యాత్రలో పాల్గొనేలా చూడాలని స్పష్టం  చేశారు. రాజస్థాన్‌లోని ముగ్గురు ఎంపీలు చేసిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని సత్వర చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని, అశోక్ గెహ్లాట్‌లను కోరారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించడం సాధ్యం కాకపోతే.. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేయాలని రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా అభ్యర్థించారు.

click me!