కాంగ్రెస్‌కు ఇంకెన్నాళ్లు తాత్కాలిక అధ్యక్షులే సారథ్యం వహించాలి?: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Sep 18, 2021, 8:07 PM IST
Highlights

పంజాబ్‌ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన రోజే పార్టీ నాయకత్వంపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే నాయకత్వ మార్పు డిమాండ్లు వినిపిస్తుండగా శశిథరూర్ కేంద్ర కమిటీ నాయకత్వ మార్పునూ నొక్కి పలికారు. ఇప్పటికీ రెండేళ్లుగా కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్యక్షులే కొనసాగుతున్నారని, ఇప్పుడు శాశ్వత అధ్యక్షుడు ఉండాల్సిన అవసరముందని అన్నారు.

తిరువనంతపురం: ఒకవైపు పంజాబ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలగా ఎంపీ శశిథరూర్ మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీకి పర్మనెంట్ అధ్యక్షుడు అవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీకి తాత్కాలిక అధ్యక్షులే ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ నేతలందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

‘మా అందరికీ సోనియా గాంధీ నాయకత్వం ఇష్టం. కానీ, ఇప్పుడు పార్టీకి ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగానే ఉన్నారు. గత రెండేళ్లుగా తాత్కాలికంగానే కొనసాగుతున్నారు. పర్మనెంట్ ప్రెసిడెంట్ లేరు. ఈ లోపాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలి. కాంగ్రెస్ వ్యవస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాల్సి ఉన్నది. కాబట్టి, పార్టీకి పర్మనెంట్ అధ్యక్షుడు ఉండటం అవసరం. మేమంతా పర్మినెంట్ ప్రెసిడెంట్ కోసం డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు.

కేరళలోని మువత్తుపుజాలో పార్టీ ఎమ్మెల్యే మాథ్యూ కుజలన్నందన్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శశిథరూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారని కొన్ని ఏళ్లుగా అడుగుతున్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కొత్త నాయకత్వం ఏర్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే, అది కూడా వేగంగా జరిగిపోవాలని అన్నారు.

పంజాబ్‌లో సీఎం పదవికి కెప్టెన్ అమరీంద్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీలో గ్రూపు తగాదాలతో ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించడంలో అదిష్టానం విఫలమైంది. దీంతో సింగ్ రాజీనామా చేయకతప్పలేదు. కాగా, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చండీగడ్ సీఎం భుపేశ్ బగేల్‌ల పదవులపైనా వేలెత్తుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా రాష్ట్రాల్లో సంక్షోభాలు తరుముకురావడం కాంగ్రెస్‌ను కలవరంలోకి నెడుతున్నది. ఈ తరుణంలో పార్టీ కేంద్రకమిటీలోనూ అసమ్మతి స్వరాలను అదుపు చేయడం కత్తిమీద సాముగా మారింది.

click me!