మహిళా ఎంపీలపైనే చేయిచేసుకుంటారా..? : కాంగ్రెస్ నేత ధ్వజం

By Siva KodatiFirst Published Nov 25, 2019, 7:10 PM IST
Highlights

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వాడివేడీగా సాగుతున్నాయి. సోమవారం నాడు జరిగిన సమావేశాల్లో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వాడివేడీగా సాగుతున్నాయి. సోమవారం నాడు జరిగిన సమావేశాల్లో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది.

ఈ తరుణంలో కాంగ్రెస్-బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ‘రాజ్యాంగాన్ని రక్షించండి.. ప్రజా స్వామ్యాన్ని కాపాడండి’ అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు.

మరోవైపు మహిళా ఎంపీలు సైతం రంగంలోకి నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పలువురు మహిళా ఎంపీలను సెక్యూరిటీ సిబ్బంది, మార్షల్స్‌తో బలవంతంగా బయటికి తీసుకెళ్లారు.  కొందరు ఎంపీలపై సిబ్బంది చేయి చేసుకున్నారు కూడా.

Also Read:మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ నిరసన: లోక్‌సభలో రాహుల్, బయట సోనియా

అయితే మహిళా ఎంపీలను ఇలా అగౌరవపరుస్తూ.. వారిపై చేయిచేసుకుని మరీ బయటికి తీసుకెళ్లడమేంటి..? కేంద్రాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా..? ప్రశ్నిస్తే ఇలా ప్రవర్తిస్తారా..?  కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, మాజీలు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మంత్రులు, ఎంపీలపై మండిపడుతున్నారు.

ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ కీలకనేత అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. మహిళా ఎంపీల పట్ల మార్షల్స్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సెక్యూరిటీ సిబ్బంది తమ పార్టీకి చెందిన మహిళా ఎంపీలపై వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలను మునుపెన్నడూ చూడలేదని.. తాను ఎంపీగా కొన్నేళ్లపాటు ఉన్నానని ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా..? అని వేచి చూస్తున్నామన్నారు.

Also Read:ఇరిగేషన్ స్కాంలో అజిత్ పవార్‌కు క్లీన్ చీట్: క్విడ్‌ప్రోకో అంటూ సేన విమర్శలు

కాగా.. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ మహిళా ఎంపీ జోతిమణి, రమ్య హరిదాస్‌లు ఇద్దరూ ఇప్పటికే ఇవాళ జరిగిన పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకండి.. రక్షించండి’ అంటూ అటు సోషల్ మీడియా వేదికగా.. మీడియా ముఖంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇవాళ పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై ప్రధాని మోదీ, స్పీకర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

click me!