
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సిఎం ఇబ్రహీం (former central minister cm ibrahim) పార్టీకి గురువారం రాజీనామా చేశారు. రాజీనామా విషయంలో నేడు ఆయన స్పందించారు. కాంగ్రెస్ (congress) తనను పట్టించుకోలేదని చెప్పారు. తన రాజకీయ ఎత్తుగడను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. తనపై ఉన్న భారాన్ని నుంచి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (aicc president sonia gandhi) విముక్తి కలిగించారని తెలిపారు. ఇప్పుడు సంతోషంగా ఉందని అన్నారు. ఇక నుంచి నాకు సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లభించిందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని తన శ్రేయోభిలాషులతో మాట్లాడిన తరువాత నా నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. నా విషయంలో కాంగ్రెస్ ఒక ముగిసిన అధ్యాయం అని సిఎం ఇబ్రహీం అన్నారు.
ఈ నెల ప్రారంభంలో కర్నాటక శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్న ఎస్ ఆర్ పాటిల్ (s r patil) పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో విపక్ష నేతగా బీకే హరిప్రసాద్ (bk hariprasad)ను కాంగ్రెస్ బుధవారం నియమించింది. ఈ విషయంలో ఆయన సిఎం ఇబ్రహీం మాట్లాడుతూ.. ‘‘ బి కె హరిప్రసాద్ నా కంటే జూనియర్ లీడర్. నేను అతని క్రింద ఎలా పని చేయగలను?’’ అంటూ నిరాశతో మాట్లాడారు.
సిఎం ఇబ్రహీం కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య (sidha ramiah)కు ఇటీవలి వరకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆయన 1996లో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (former prime minister hd deve gouda) క్యాబినెట్‌లో పౌర విమానయాన, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2008లో జనతాదళ్ (సెక్యులర్) నుంచి కాంగ్రెస్‌లో చేరారు.
దేవెగౌడ లాంటి గొప్ప నాయకుడిని వదిలేసి, ఈయన కోసం (సిద్దరామయ్య) కోసం తాను జనతాదళ్‌ను వదిలిపెట్టానని సిఎం ఇబ్రహీం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సిద్ధరామయ్య తనకు ఏమీ ఇచ్చారని ప్రశ్నించారు. తనను ఆశీర్వదించి, ఆదరించిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు తగిన సమాధానం చెబుతారని అన్నారు. అయితే ఇప్పుడు జనతాదళ్ (సెక్యులర్)లో చేరతారా అని అడిగిన ప్రశ్నకు.. ‘‘ జేడీ (ఎస్) లేదా మమతా బెనర్జీ పార్టీ (తృణమూల్ కాంగ్రెస్) లేదా లాలూ యాదవ్ పార్టీ (రాష్ట్రీయ జనతాదళ్) లేదా ములాయం, అఖిలేష్ యాదవ్ ల పార్టీ (సమాజ్‌వాదీ పార్టీలో) చేరాలా అని ఆలోచిస్తున్నాని తెలిపారు. జేడీ(ఎస్) హెచ్‌డి దేవెగౌడ, హెచ్‌డీ కుమారస్వామి (hd kumara swamy)తో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటాను.’’ అని చెప్పారు.
జేడీ(ఎస్) నేత కుమారస్వామి గతంలో ఓ సారి ఇబ్రహీంను కలిసి తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ‘‘ఇబ్రహీంకు పార్టీ మాజీ సీనియర్ నాయకుడు, దేవెగౌడతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయనకు గౌడ, జేడీ(ఎస్)పై ఇప్పటికీ ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆయన పార్టీలోకి రావాలని నిర్ణయం తీసుకుంటే స్వాగతం పలుకుతాం. అయితే ఇబ్రహీంకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత పదవిని ఇస్తే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను సూచించాను. కానీ కాంగ్రెస్ ఆయనకు పదవి ఇవ్వలేదు’’ అని కుమార స్వామి చెప్పారు.