Punjab Assembly Election 2022: సీఎంను నిర్ణయించేది కాంగ్రెస్ హైకమాండ్ కాదు.. పార్టీకి సిద్దూ కొత్త వార్నింగ్

By Mahesh KFirst Published Jan 12, 2022, 4:05 AM IST
Highlights

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజులు ఉన్న తరుణంలో ఆయన నర్మగర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కే సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించదని, పంజాబ్ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదని గత నెల ఆ పార్టీ సీనియర్ నేత వెల్లడించారు.

చండీగడ్: మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Election) జరగనున్న పంజాబ్‌(Punjab)లో అధికార పార్టీ కాంగ్రెస్‌(Congress)లో మాత్రం అంతర్గత వైరుధ్యాలు ఇంకా చాప కింది నీటిలో కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తున్నది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాకు ముందటి నుంచి నవజోత్ సింగ్ సిద్దూ(Navjoth sidhu) పార్టీ అంతర్గత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పలుసార్లు పార్టీ హైకమాండ్‌కే అల్టిమేటం విధించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, కాంగ్రెస్ హైకమాండ్‌కు పరోక్షంగా మరో వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి(Chief Minister)ని నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదని అన్నారు. పంజాబ్ రాష్ట్ర ప్రజలే ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని, వారే సీఎంను నిర్ణయిస్తారని వివరించారు. ఆయన చండీగడ్‌లో నిర్వహించిన పంజాబ్ మోడల్ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమానికీ సీఎం చరణ్ జిత్ సిగ్ చన్నీ సహా పలువురు కీలక కాంగ్రెస్ నేతలు హాజరుకాలేదు. కార్యక్రమ బ్యానర్‌లోనూ వారి ఫొటోలు కనిపించకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ వచ్చారు. పంజాబ్ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందమని మీకు ఎవరు చెప్పారని విలేకరులను తిరిగి ప్రశ్నించాడు. పంజాబ్ రాష్ట్ర ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అలాంటి తప్పుడు అభిప్రాయాలను మెదడులో ఉంచుకోవద్దని అన్నారు. పంజాబ్ రాష్ట్ర ప్రజలే ఎమ్మెల్యేను ఎన్నుకుంటారనే, వారే ముఖ్యమంత్రినీ నిర్ణయిస్తారని వివరించారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 14వ తేదీన సింగిల్ ఫేజ్‌లో జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్‌ను ప్రకటించలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ ఝాకర్ వెల్లడించారు. ఈ ఎన్నికలను పార్టీ సంయుక్త నాయకత్వం కింద పోరాడుతుందని తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో సునీల్ ఝాకర్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాతే సీఎం క్యాండిడేట్‌పై సిద్దూ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చరణ్ జిత్ సింగ్ చన్నీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా నవజోత్ సింగ్ సిద్దూ చిటపటలాడటం మానలేదు. సొంత పార్టీ ప్రభుత్వాన్నే పలుమార్లు విమర్శించారు కూడా. పార్టీ హైకమాండ్‌కు సైతం అల్టిమేటం పెట్టారు. ఇటీవలే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చరణ్‌ ఉద్దేశ్యాలు మంచివేనని అన్నారు. కానీ, రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించడానికి ఆయన బడ్టెట్ కేటాయింపులు, రీసెర్చ్, సరైన పాలసీలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

శాసన సభా గడువు ముగుస్తున్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అసంబ్లీ ఎన్నికల నిర్వహణ నుంచి వెనుకడుగు వేయడం లేదని వివరించింది. నిన్ననే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలన ప్రకటించింది. యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్  రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఏడు షెడ్యూల్‌లలో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఒక్క యూపీలో మాత్రమే ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కరోనా కేసుల నేపథ్యంలో జనవరి 15వ తేదీ వరకు ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించింది. ఆ తర్వాతే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షిస్తామని తెలిపింది.

click me!