డియర్ సైనా.. అయామ్ సారీ!.. క్షమాపణలు చెప్పిన హీరో సిద్దార్థ్.. ఆ లేఖలో ఏం రాశాడంటే?

By Mahesh KFirst Published Jan 12, 2022, 2:02 AM IST
Highlights

ప్రధాని మోడీకి భద్రతా వైఫల్యం ఏర్పడిన ఘటనపై సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌‌కు హీరో సిద్ధార్థ్ స్పందన చర్చనీయాంశం అయింది. తన ట్వీట్‌లో ఉపయోగించిన కొన్ని పదాలు పెడర్థాలు తీశాయి. దీంత ఆ తర్వాత మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చినప్పటికీ ఆయనపై విమర్శలు ఆగలేవు. ఎన్‌సీడబ్ల్యూ కూడా ఆయనకు నోటీసులు పంపింది. దీంతో తాజాగా, సైనా నెహ్వాల్‌కు బహిరంగంగా క్షమాపణల లేఖ రాసి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
 

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌(Saina Nehwal)కు హీరో సిద్దార్థ్(Actor Siddharth) బహిరంగ క్షమాపణలు(Public Apology) చెప్పాడు. రూడ్ జోక్(Rude Joke) చేసినందుకు మన్నించు అంటూ ఆయన ట్విట్టర్‌లో క్షమాపణలు చెబుతూ ఓ లేఖ పోస్టు చేశాడు. తన ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేదని, కానీ, కొందరు ఎన్నో అపవాదాలను తన వ్యాఖ్యలతో అంటగట్టారని పేర్కొన్నాడు. తాను మహిళల పక్షపాతి అని, సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించిన ట్వీట్‌లో జెండర్‌ను ఉపయోగించనేలేదని, ఒక మహిళగా ఆమెపై ఎలాంటి అభ్యంతరకర పదాలను వాడలేదని వివరించాడు. తన రూడ్ జోక్‌ను మన్నించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరాడు. తన క్షమాపణలను అంగీకరించాల్సిందిగా సైనా నెహ్వాల్‌కు విజ్ఞప్తి చేశాడు. ‘నువ్వు ఎప్పుడూ నా చాంపియన్‌’గా ఉంటావు అంటూ పేర్కొన్నాడు.

ట్విట్టర్‌లో హీరో సిద్దార్థ్ పోస్టు చేసిన తన లేఖలో ఇలా రాసుకొచ్చాడు. ‘కొన్ని రోజుల క్రితం మీ ట్వీట్‌కు ప్రతిస్పందనగా నేను ఒక రూడ్(మొరటు!) జోక్ రాశాను. ఆ రూడ్ జోక్ కోసం మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. చాలా విషయాల్లో నేను మీతో విభేదించవచ్చు. మీ ట్వీట్ చదివినప్పుడు నాలో కలిగిన నిరాశ, ఆగ్రహాలు.. మీకు స్పందనగా వాడిన పదాల ఎంపికను జస్టిఫై చేయలేవు. ఆ ఆగ్రహానికి మించి నాలో మంచితనమూ ఉన్నదని నాకు తెలుసు.

ఇక జోక్ విషయానికి వస్తే.. ఒక జోక్‌నే వివరించాల్సి వస్తే.. నా జోక్ అంత బాగాలేదు. సరిగా పేలని ఆ జోక్ చేసినందుకు సారీ. కానీ, ఇక్కడ మరో విషయాన్ని నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. నా పదాల కూర్పు, హాస్యంలో ఎలాంటి ద్వేషపూరిత ఉద్దేశాలు ఏమీ లేవు. కానీ, చాలా మంది నాకు ఆ ద్వేషాన్ని అంటగట్టి మాట్లాడారు. నేను నిఖార్సైన స్త్రీవాది పక్షపాతిని. నా ట్వీట్‌లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. ఒక మహిళగా భావించి మిమ్మల్ని దాడి చేయాలనే ఉద్దేశం అందులో లేదు.

Dear pic.twitter.com/plkqxVKVxY

— Siddharth (@Actor_Siddharth)

ఈ వివాదాన్ని ఇంతటితో మరిచిపోదాం. నా క్షమాపణలను మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడూ నా చాంపియనే.’ అంటూ సిద్ధార్థ్ తన క్షమాపణల లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి ఏర్పడ్డ భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై చాలా మంది స్పందించారు. అదే రీతిలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కూడా ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. ఒక దేశ ప్రధానమంత్రికే భద్రత కరువైతే.. ఏ దేశం కూడా తాను సురక్షితమైనందని చెప్పుకోజాలదు అని ఆమె ట్వీట్ చేశారు. ప్రధాని మోడీపై అరాజకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌పై హీరో సిద్ధార్థ్ మండిపడ్డారు. కాక్ చాంపియన్ అనే పదాన్ని తన ట్వీట్‌లో ఉపయోగించాడు. ఇది పెడర్థాలకూ దారి తీసింది. దీంతో సిద్దార్థ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది ఆయనపై మండిపడ్డరు. ఎన్‌సీడబ్ల్యూ కూడా నోటీసులు పంపింది. ఆ తర్వాత సిద్దార్థ్ కూడా వివరణ ఇచ్చుకున్నారు. ‘కాక్ అండ్ బుల్’ ఇదే తన రిఫరెన్స్ అని వివరించారు. ఈ పదాలను మనసులో భావించే అక్కడ ఉపయోగించినట్టు పేర్కొన్నారు. అంతేకానీ, వాటిని వేరే దారిలో చదవడం సరికాదని, అది తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు. తన ట్వీట్‌లో ఒకరిని అగౌరవపరిచే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. అయినా.. విమర్శలు ఆగలేదు. దీంతో తాజాగా, సైనా నెహ్వాల్‌కు క్షమాపణల లేఖ రాశాడు.

click me!