లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై జోస్యం చెప్పారు. పార్టీలో అంతర్గత కలహాలతో ప్రభుత్వం బలహీనమైపోతుందని అన్నారు.
పార్లమెంటరీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోతుందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. పార్టీ చీలిక ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం వేస్తుందని అన్నారు. అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదని అభిప్రాయపడ్డారు. కాబట్టి, లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు.
సోమవారం గడగ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్టింగ్ ఎంపీ శివకుమార్ ఉదాసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి పగ్గాలు పట్టడం ఖాయం అని పేర్కొన్నారు. గడగ్, హవేరీ లోక్ సభ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పని చేస్తున్నారని వివరించారు.
మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. గడగ్ హవేరీ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై ఆయన పోటీ చేస్తున్నారు. అయితే.. ఆ స్థానం ఆశించి భంగపడ్డ కేఎస్ ఈశ్వరప్ప పార్టీ కోసం పని చేస్తారని అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నదని, ఇంతలో ఆయన సర్దుకుంటారని వివరించారు.