తెలంగాణలో గెలుపుతో దక్షిణాదిన మరో రాష్ట్రం కాంగ్రెస్ ఖాతాలో పడింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగివున్న వేళ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మహారాష్ట్ర ఫార్ములానే బిజెపి ఉపయోగిస్తోందట. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మంత్రి ఏక్ నాథ్ షిండే ను ఉపయోగించుకున్నట్లే కర్ణాటకలోనూ మరో మంత్రికి గాలం వేసిందట. అతడి సాయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి సిద్దమవుతోందట... ఇందుకోసం ఇప్పటికే స్కెచ్ రెడీ అయ్యిందట. మహారాష్ట్రలో మాదిరిగానే ఏ క్షణమైన కర్ణాటకలో రాజకీయ పరిణామాలు మారవచ్చంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడిఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు.
గతంలో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడిఎస్ ఇటీవల బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమిలో చేరింది. దీంతో కర్ణాటకలో ఏదో జరుగుతోందని రాజకీయ విశ్లేషకులకే కాదు సామాన్యులకు సైతం అర్థమయ్యింది. ఇప్పుడు కుమారస్వామి వ్యాఖ్యలు ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. అధికార కాంగ్రెస్ కు చెందిన మంత్రితో పాటు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడనున్నట్లు మాజీ సీఎం తెలిపారు. ప్రస్తుతం వీరంతా బిజెపి అదిష్టానం, రాష్ట్రంలోని కీలక నాయకులతో టచ్ లో వున్నారని కుమారస్వామి తెలిపారు. వీరంతా ఒకేసారి మూకుమ్మడిగా పార్టీమారడంతో సిద్దరామయ్య ప్రభుత్వ కుప్పకూలుతుందని కుమారస్వామి అన్నారు. మాజీ సీఎం వ్యాఖ్యలు ఒక్కసారిగా కర్ణాటక రాజకీయాల్లో హీట్ పెంచాయి.
కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వంలోని ఓ మంత్రి తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్నారు... వాటినుండి తప్పించుకునేందుకే బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యాడని కుమారస్వామి తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల అతడొక్కడే కాదు తనతో పాటు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపిలోకి తీసుకెళ్లనున్నాడు. దీంతో ఆటోమెటిక్ గా సిద్దరామయ్య ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని జేడిఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also Read India Bloc: మళ్లీ ఇండియా కూటమి హడావిడి.. 19న ఢిల్లీలో భేటీ, సీటు షేరింగ్‌పై డిస్కషన్!
ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతున్నా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం మొదటిసారి అధికారాన్ని చేజిక్కించుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ దక్షిణాదిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతోంది. ఇలాంటి సమయంలో కుమారస్వామి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలకు ముందే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి పావులు కదుపుతోందని కుమారస్వామి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. తద్వారా దక్షిణ భారతంలో కూడా కాంగ్రెస్ ను వీక్ చేసాక లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలన్నది బిజెపి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే నిజంగానే బిజెపితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారా? లేక బిజెపి పొలిటికల్ గేమ్ లో భాగంగానే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసారా? అన్న ప్రశ్నలకు కర్ణాటక భవిష్యత్ రాజకీయాలే సమాధానం చెబుతాయి.