
ఢిల్లీలో ఏఐసీసీ (aicc) ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. సంస్థాగత నిర్మాణంపై ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. దేశవ్యాప్త నిరసనలు, ప్రజా ఆందోళనలు చేపట్టనుంది. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ సిలిండర్ ధరల (petrol diesel price) పెరుగుదల కారణంగా సామాన్యులపై పెను ప్రభావం పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ధరల పెరుగుదల పెంపుపై కార్యాచరణ సిద్ధం చేసింది. మార్చి 31న థాలీ బజావో మెహంగీయూ భగావో నినాదంతో ఆందోళనలు చేపట్టనుంది. అలాగే ఏప్రిల్ 2 నుంచి 4 వరకు దేశంలోని బ్లాకు స్థాయిల్లో ధరల పెరుగుదలపై నిరసనలు జరపనుంది. ఏప్రిల్ 7న రాష్ట్రాల రాజధానుల్లో పెట్రో ధరలు పెరుగుదల, ప్రభావంపై నిరసనలు తెలుపనున్నారు.
ఇకపోతే.. గుజరాత్‌పై (gujarat assembly elections) గురిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తోంది. దీని కోసం అప్పుడు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్‌లో పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కార్యదర్శులను నియమించింది. ప్రస్తుతం వున్న నాయకులను తొలగించింది. ఉమంగ్ సింగర్, వీరేందర్ సింగ్ రాథోడ్, బీఎం సందీప్‌లకు రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న రఘు శర్మకు సహాయ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పార్టీ పని కోసం రామ్‌కిషన్ ఓజా ను కూడా నియమించారు.
1989 నుంచి గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో లేదు , గత ఎన్నికల్లో కూడా అధికార బీజేపీని గద్దె దింపలేకపోయింది. అయితే, ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నిల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. అధికారం దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో, రాష్ట్ర నాయకులు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహరచన గుజరాత్ ఎన్నికల కోసం తీసుకువచ్చే ఎంపికను ప్రస్తావించారు. అయితే, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ, పార్టీ సంస్థాగత సమస్యలపై చర్చించడానికి నాయకులు ముందుకు సాగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలు రాబట్టింది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా మెరుగైన ఫలితాలు రాబట్టలేక డీలాపడ్డ కాంగ్రెస్.. గుజారత్ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడానికి ప్రణాళికలు రచిస్తోంది. గత ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో డీఎంకే, టీఎంసీ విజయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ కీలక పాత్ర పోషించింది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్-ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను (prashant kishor) తీసుకువచ్చే అవకాశాలు బలంగా ఉన్నట్టు ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలు కూడా ఈ విషయాన్ని తోసిపుచ్చలేకపోయారు.
ఇదిలావుండగా, గుజరాత్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రజావ్యతిరేక చర్యలను నిరశిస్తూ.. ఆందోళనకు దిగారు. రైతులకు విద్యుత్ అందుబాటులో లేకపోవడాన్ని నిరసిస్తూ, రాజ్‌కోట్‌లోని ధోరాజీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లలిత్ వసోయా మరియు సోమనాథ్ నుండి విమల్ చుడాస్మా తమ చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కలిసి వారు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.