హిమాచల్ ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌కు సేమ్ ప్రాబ్లమ్? లేవనెత్తుతున్న బీజేపీ.. విరుచుకుపడ్డ అమిత్ షా

By Mahesh KFirst Published Nov 4, 2022, 4:32 PM IST
Highlights

గుజరాత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్‌కూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, పార్టీకి రాష్ట్రంలో సరైన నాయకత్వం అందించే లీడర్ లేక సతమతం అవుతున్నది.
 

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుంది. కానీ, ఆ ప్రభుత్వ వ్యతిరేకతను సరిగ్గా వినియోగించుకుని పార్టీని విజయతీరానికి చేర్చే నాయకుడే లేడు. అసలు హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు రియల్ సీఎం ఫేసే లేకుండా ఉన్నది. కానీ, నేనంటే నేనూ అన్నట్టు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫేస్ చేస్తున్న ఇలాంటి సమస్యనే బీజేపీ ఇక్కడ ప్రముఖంగా లేవనెత్తుతున్నది.

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ ఇటీవలే మరణించారు. ఆరు సార్లు సీఎం, తొమ్మిది సార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ, మూడు సార్లు కేంద్ర మాజీ మంత్రి, నాలుగు సార్లు స్టేట్ పార్టీ చీఫ్‌గా వ్యవహరించిన వీరభద్ర సింగ్ గతేడాది జులై 8వ తేదీన మరణించారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో సారథ్యం వహించగలరని చెప్పుకోదగ్గ నేత కరువయ్యారు. అందుకే ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ సీఎం ఫేస్ ఈయన అని చెప్పడానికి లేకుండా పోయింది. కాగా, బీజేపీ మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌నే సీఎం అభ్యర్థిగా దించే సంకేతాలను ఇస్తున్నది.

Also Read: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దం.. సార్ట్ క్యాంపెయినర్లను ప్రకటించిన బీజేపీ.. ఆ జాబితాలో ...

సీఎం పోస్టు కోసం కాంగ్రెస్‌లో పోటీ మొదలైంది. ముఖ్యంగా ముగ్గురు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో వీరభద్ర సింగ్ సతీమణి, సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ముకేశ్ అగ్నిహోత్రి, పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఇంచార్జ్ సుఖ్‌విందర్ సింగ్ సుఖులు ఉన్నారు. అయితే, వారిలో ఎవరినీ ఫ్రంట్ రన్నర్‌గా పార్టీ ప్రకటించలేదు. పార్టీ సీఎం క్యాండిడేట్‌ను ప్రకటించకపోవడంపై ఇప్పటికీ కాంగ్రెస్ మౌనం పాటిస్తున్నది. ఇది సీఎం పోస్టు కోసం కొత్త పోటీని రగిల్చేలా ఉన్నది.

లోకల్‌గా నాయకత్వలేమి మాత్రమే కాదు.. ఏఐసీసీ ప్రత్యక్ష ప్రభావం కూడా ఈ రాష్ట్రంలో దాదాపు శూన్యమే అని చెప్పొచ్చు. భారత్ జోడ యాత్ర కారణంగా రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో క్యాంపెయిన్ నిర్వహించే పరిస్థితులు లేవు. అయితే, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా మాత్రం రాష్ట్రంలోని పెద్ద జిల్లా కాంగ్రాలో నగ్రోటా భగవాన్ నుంచి క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు.

Also Read: భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ యాత్రపై కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు వైరల్ !

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం, బుధవారం ఇక్కడ ప్రచారం చేశారు. ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఆయన కాంగ్రెస్ పై విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆ పార్టీ సీఎం ఫేస్ కూడా ప్రకటించలేకపోతున్నదని పేర్కొన్నారు. ఈ పోస్టు కోసం పార్టీలో కనీసం 8 మంది పోటీ పడుతున్నారని అన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కేవలం తల్లీ కొడుకుల పార్టీ అంటూ విమర్శలు చేశారు.

కాగా, నగ్రోటా భగవాన్ నామినీ, కాంగ్రెస్ లీడర్ నగ్రోట భగవాన్ నామినీ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, ప్రజలు తమ హయాంలో చేసిన మంచి పనులనే గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎలా అంటారని ప్రశ్నించారు. చాలా చోట్ల అది తప్పుడు విధానాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, అది అప్రజాస్వామిక విధానం అని విమర్శించారు.

click me!