కాంగ్రెస్‌ను హుక్కా బార్లు ఓపెన్ చేసి నెహ్రూ పేరు పెట్టుకోమనండి: బీజేపీ నేత సీటీ రవి

By telugu teamFirst Published Aug 13, 2021, 4:53 PM IST
Highlights

నెహ్రూ, గాంధీల పేర్లే కొనసాగాలనుకుంటే కాంగ్రెస్ తమ పార్టీ కార్యాలయంలో హుక్కా బార్లు ఓపెన్ చేసి వాటికి ఆ పేర్లు పెట్టుకోవచ్చునని బీజేపీ జనరల్ సెక్రెటరీ సీటీ రవి అన్నారు. ప్రభుత్వ సంస్థలు, పథకాలు, అవార్డులకు వారి పేరు పెట్టడంపై విమర్శలు చేశారు. ఇందిరా క్యాంటీన్ పేరు అన్నపూర్ణేశరి క్యాంటీన్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.

బెంగళూరు: బీజేపీ జనరల్ సెక్రెటరీ సీటీ రవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రాలకు నెహ్రూ మొదలు గాంధీ కుటుంబ సభ్యులను పేర్లు పెట్టుకుంటూ వచ్చిందని విమర్శించారు. నెహ్రూ పేరే అన్ని సంస్థలకు
కనిపించాలని కాంగ్రెస్ భావిస్తే ఆ పార్టీ కార్యాలయంలో హుక్కా బార్ ఓపెన్ చేసుకుని నెహ్రూ పేరు పెట్టకోమనండని అన్నారు.

బీజేపీ నేత సీటీ రవి శుక్రవారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో నడుస్తున్న ఇందిరా క్యాంటీన్‌ల పేరును అన్నపూర్ణేశ్వరీ క్యాంటీన్‌లుగా మార్చాలని సూచించారు. అన్నపూర్ణేశ్వరి పేరే క్యాంటీన్‌లకు సరైందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఈ క్యాంటీన్‌లలో ప్రజలకు కాంగ్రెస్ డబ్బులు పెట్టి ఆహారం అందించట్లేదు కదా అని ఎద్దేవా చేశారు. ఆ డబ్బులు ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి వచ్చినవేనని వివరించారు. వీటికైతే అన్నపూర్ణేశ్వరి పేరే కరెక్ట్ అని, ఒకవేళ వారు పెట్టిన పేర్లే కొనసాగాలనుకుంటే పార్టీ కార్యాలయంలో హుక్కా బార్ ఓపెన్ చేసి ఆ పేర్లు పెట్టుకోవచ్చునని అన్నారు.

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ధ్యాన్‌చంద్ అవార్డుగా మారుస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీటీ రవి వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత డీకే శివ దీటుగా స్పందించారు. బీజేపీ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. స్వాతంత్ర్య సమరోద్యమం కాలంలో, అటు తర్వాత తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన కృషిని తెలుసుకోవాలని ఉద్భోదించారు. 

నెహ్రూ, ఇందిరా, రాజీవ్ పేర్ల ప్రతిష్టను మంటగలపడం ద్వారా బీజేపీ సంస్కృతి అర్థమవుతున్నదని శివకుమార్ విమర్శలు చేశారు. ఈ పేర్లను దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు, చేసిన మార్గదర్శకాలు అసమానమైనవని, వారితో పోల్చదగిన బీజేపీ నేతల్లేరని విమర్శించారు. తాము క్యాంటీన్ స్కీమ్‌కు పేరు మార్చడం లేదని రాష్ట్రమంత్రివర్గం నుంచి సమాచారం అందింది. రాష్ట్ర క్యాబినెట్ మందుకు ఈ అంశం రాలేదని తెలిసింది.

click me!