Ayodhya verdict: అయోధ్య తీర్పు... అలర్టైన కాంగ్రెస్, సీడబ్ల్యూసీ భేటీ

By telugu teamFirst Published Nov 9, 2019, 9:13 AM IST
Highlights

ఇప్పటికే ఈ తీర్పు విషయంలో కాంగ్రెస్ నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదని, అలాగే ఎవరు పడితే వారు మీడియాతో తమ భావాలను పంచుకోవద్దని అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. 

వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు ఉదయం  10గంటల 30 నిమిషాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేపథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ముందుగానే అలర్ట్ అయ్యారు. మరికాసేపట్లో తీర్పు వెలువడనుండగా... శనివారం ఉదయం కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ అధ్యక్షతన భేటీకానున్నారు.

AlsoRead Ayodhya Verdict: అయోధ్య తీర్పు... పాఠశాలలు, కాలేజీలకు సెలవులు...

ఇప్పటికే ఈ తీర్పు విషయంలో కాంగ్రెస్ నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదని, అలాగే ఎవరు పడితే వారు మీడియాతో తమ భావాలను పంచుకోవద్దని అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇష్టం మొచ్చినట్లు మాట్లాడి, పార్టీకి తీరని నష్టం చేకూర్చారని అధినేత్రి సోనియా గాంధీ భావించారని కొందరు సీనియర్లు అంటున్నారు.
 
ఈ సారి మాత్రం అయోధ్య విషయంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు, వివాద ప్రకటనలు రాకుండా పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అయోధ్యపై ఇప్పటికే పార్టీ ఓ తీర్మానం తీసుకురావాలని డిసైడ్ అయ్యింది. అయోధ్యపై సుప్రీం ఎలాంటి తీర్పును వెలువరించినా, దానికి కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ అధిష్ఠానం నేతలకు స్పష్టం చేసింది.

AlsoRead Ayodhya Verdict... అయోధ్య తీర్పు... ఈ రోజే ఎందుకు..?...

అధికార బీజేపీ ప్రభుత్వం స్పందన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందించాలని  భావిస్తున్నట్లు తెలుస్తోంది.  దీని ప్రకారమే నడుచుకోవాలని, నేతలెవ్వరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని అధిష్ఠానం ఇప్పటికే హుకూం జారీ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా.... ఈ తీర్పు విషయమై ప్రధాని మోదీ శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా స్పందించారు.  అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుందని ఆయన చెప్పారు. ఆ తీర్పు ఒకరి విజయం కాదని..  అలా అని ఓటమీ కూడా కాదన్నారు. ఈ తీర్పు భారత దేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.

దేశ ప్రజలంతా శాంతి, ఐక్యత, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్థ  పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక, సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం అంతా కలిసి మెలసి నిలబడాలని పిలుపునిచ్చారు.

కాగా... ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
 

click me!