ఫ్రమ్ ది ఇండియా గేట్: రాజకీయ డిక్షనరీలో నైట్ డ్యూటీ అలవెన్స్.. అఖిలేష్ వ్యుహంపై పార్టీ నేతల ఆశ్చర్యం..!

Published : Mar 26, 2023, 11:25 AM IST
ఫ్రమ్ ది ఇండియా గేట్: రాజకీయ డిక్షనరీలో నైట్ డ్యూటీ అలవెన్స్.. అఖిలేష్ వ్యుహంపై పార్టీ నేతల ఆశ్చర్యం..!

సారాంశం

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 19వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నైట్ డ్యూటీ అలవెన్స్..
నైట్ డ్యూటీ అలవెన్స్ అనే హెచ్‌ఆర్ పరిభాష ఇప్పుడు రాజకీయ డిక్షనరీలోకి కూడా ప్రవేశించింది. రాజకీయ నాయకులందరూ తమ పాపులారిటీని ప్రదర్శించేలా వారి వారి కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనాలు ఉండాలని కోరుకుంటారనే సంగతి తెలిసిందే. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పార్టీల కార్యక్రమాల కోస జనాలను పోగుచేసే ఆట జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు తమ తమ ర్యాలీలకు, ప్రచార సభలకు హాజరయ్యే కార్యకర్తలకు, జనాలకు భృతి చెల్లిస్తాయనేది రహస్యమేమీ కాదు. అయితే బెళగావి జిల్లాలో ఓ ర్యాలీ నిర్వాహకులను షాక్‌కు గురిచేసింది. అందుకు నైట్ డ్యూటీ అలవెన్స్ లేకపోవడమే కారణంగా కనిపిస్తుంది.

సాధారణంగా.. ఎన్నికల ప్రచారం కోసం ఒక ప్రాంతంలో పర్యటించే సీనియర్ నాయకులు తమ యాత్రలో అనేక కార్యక్రమాలను ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే కార్యక్రమాలలో ఒకటి ఆలస్యమైతే.. తదుపరి ర్యాలీలు కూడా ఆలస్యమవుతాయి. ఇలాంటి ఘటనే బెళగావి జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో చోటుచేసుకుంది. మధ్యాహ్నానికి వేదిక వద్దకు చేరుకోవాల్సిన నాయకులు సాయంత్రం వరకు కనిపించకపోవడంతో నిర్వహకుల ప్రణాళికలు తారుమారయ్యాయి.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డబ్బులు తీసుకుని ఆ కార్యక్రమానికి వచ్చినవారు తమకు ‘‘రోజు భత్యం’’ మాత్రమే చెల్లించినందున రాత్రి పొద్దుపోయేసరికి ఉండలేమని వెళ్లిపోయారు. సాయంత్రం దాటాక వారు వెళ్లకుండా చూడటం అంటే వారికి అదనపు డబ్బు లేదా నైట్ డ్యూటీ భత్యం చెల్లించాల్సిన పరిస్థితి. ఇక, స్థానిక నాయకులు జనాన్ని నిలువరించడంలో విఫలమవడంతో రాష్ట్ర నాయకులకు ఖాళీ కుర్చీలతో స్వాగతం పలికారు. ఇందుకు నిర్వహకులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే భవిష్యత్ సమావేశాలకు నైట్ డ్యూటీ అలవెన్స్ చెల్లించాలని తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లాలి. 

రాగ్-పికర్స్ విజన్..
డబ్బు అనేది నిజాయితీ లేకుండా లేదా అనైతికంగా పొందడం అనేది విచిత్ర పరిణామాలకు దారితీస్తుంది. అక్షరాలా ఇది కేరళలో అధికార, ప్రతిపక్షాలను ఏకం చేసింది. ఎర్నాకుళం జిల్లాలోని బ్రహ్మపురంలో చెత్త శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసే ఒప్పందంలో సీనియర్ లెఫ్ట్ నాయకుల సమీప బంధువుల పాత్రపై ఈ కాలమ్‌లో రెండుసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడ పొగ తగ్గుముఖం పట్టడంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీపీఎం నేత అల్లుడు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టును అత్యంత ప్రముఖ సీపీఎం నేత అల్లుడు ఆశీస్సులతో కాంగ్రెస్‌ నేత అల్లుడికి సబ్‌ కాంట్రాక్ట్‌ కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

చెత్త వ్యవహారంలో.. అల్లుళ్ల పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. క్యాష్ ఫర్ ట్రాష్ కథలో రోజురోజుకు బంధుప్రీతి, అవినీతికి సంబంధించిన కథనాలను గమనిస్తే.. చెత్త కుప్పల వంటి అనేక పొరలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. ఓ వ్యక్తికి రాగ్ పిక్కర్(వ్యర్థాలను సంచిలో సేకరించే) విజన్ ఉన్నంత కాలం అతడు రాగ్ పిక్కర్‌గానే మిగిలిపోతాడని తరుచుగా ఉటంకించే మాట ఈ రాజకీయ నాయకుల విషయంలో నిజమైంది.

వయా-నాడు..
కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి (మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించింది) త్వరలో వయా-నాడ్‌గా నామకరణం చేయవలసి ఉంటుందేమో. రాహుల్‌పై అనర్హత వేటుకు దారితీసిన తీర్పులోని చట్టపరమైన సూక్ష్మ అంశాలను కేరళలోని కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తిగా అర్థం చేసుకోకముందే.. అక్కడ ఉప ఎన్నిక ప్రకటిస్తే ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయాలని సూచించే స్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానంలో ఓటమి అంచనాలతో రాహుల్ చివరి నిమిషంలో వయనాడ్‌ నుంచి కూడా బరిలోకి దిగారు.

అయితే  వాస్తవానికి ఆ స్థానం నుంచి కాంగ్రెస్ నాయకుడు టీ సిద్ధిక్ పోటీ చేయాలని భావించారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ ప్రతిపాదన వెలువడకముందు వరకు సిద్దిక్ అక్కడ ప్రచారం కూడా నిర్వహించారు. అయితే రాహుల్ వయనాడ్ నుంచి రాహుల్ బరిలో దిగడంతో.. పార్టీ తరువాత అసెంబ్లీ ఎన్నికల బరిలో సిద్దిక్‌ను పోటీకి నిలబెట్టింది. వయనాడు  జిల్లాలోని కల్పేట్ట నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 

అయితే రాహుల్‌ ప్రవేశంతో పార్టీలోని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారు. ఒకవేళ ప్రియాంక వయనాడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ స్థానాన్ని వారి కుటుంబానికి మరో సురక్షితమైన సీటుగా మార్చుకునే అవకాశం ఉందనే వాదన ఉంది. లోక్‌సభలో ప్రవేశించడానికి ఈ కాంగ్రెస్ అనుకూల సీటును వారు తప్పకుండా గెలుచుకుంటారనేది మెజారిటీ అభిప్రాయం. దీంతో మిగిలిన 19 సీట్ల కోసం కేరళ కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వయనాడ్ (వయా-నాడు) మీదుగా పార్లమెంటులోకి ప్రవేశించడం సులభమైన మార్గం అవుతుంది.

పార్టీ టైమ్..
రామచరిత్‌మానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పార్టీలోని ప్రముఖ నాయకుడిపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వెంటనే చర్యలు తీసుకుంటారని రాజకీయ పరిశీలకులు ఆశించారు. విడ్డూరమేమిటంటే.. ఆ నేతాజీని వ్యతిరేకించిన కొందరిపై మాత్రమే చర్యలు తీసుకోవడంతో రాజకీయ నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారు. అయితే వెనుకబడిన వర్గాల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు మౌనం వహించడం రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది.

హిందూ-ముస్లిం ఓటు బ్యాంకులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల పార్టీ ఇప్పటికే చాలా నష్టపోయినందున.. ఎక్కువ ఓట్లను గెలుచుకునే డిజైన్‌లో భాగంగా అఖిలేష్ ఆ నేతాజీని స్కాట్ ఫ్రీగా వెళ్లడానికి అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహం పార్టీని ముందుకు తీసుకెళ్తుందా? లేదా వెనక్కు నెట్టేస్తుందా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

నిజమైన ప్రతిపక్షం..
బురదలో కమలాన్ని చూడటం తరచుగా ఆశావాదానికి ఉదాహరణగా నిర్వచించబడుతుంది. అయితే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించడంలో బీజేపీ పైచేయి సాధిస్తుండటంతో.. ఆ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారుతున్నాయి. ఆ రెండు పార్టీలో ప్రస్తుతం పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. 2026లో రాష్ట్రాన్ని తామే పాలిస్తామని బీజేపీ అగ్రనేతలు చెబుతుండడంతో.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరింత కలవరపాటుకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆందోళన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చకు వచ్చింది.

అయితే దీనిని ఎదుర్కోవడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులను తమ గూటికి ఆకర్షించడం రెండు పార్టీల మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే పొత్తును విచ్ఛిన్నం చేస్తానని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు బెదిరించినప్పటికీ.. అతని పార్టీ సహచరులు బుద్ధి బోధించి, ప్రశాంతంగా ఉండమని చెప్పారు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఇదే భావాన్ని ప్రతిధ్వనించింది. ఈ క్రమంలోనే ఆ బీజేపీ నాయకుడు పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు మూర్ఖంగా ఉండవద్దని సలహా ఇచ్చింది. జాతీయ నాయకత్వం తన లైన్‌ను తీసుకోవడానికి నిరాకరించడంతో.. ఆ నాయకుడు తెల్లజెండా ఊపుతూ తిరిగి రావాల్సి వచ్చింది.

హసన్ ఛాలెంజ్
గత అసెంబ్లీ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ప్రీతం గౌడ్ గెలుపొందడం జేడీఎస్ శిబిరంలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. అంతకు ముందు వరుసగా మూడు సార్లు ఆ స్థానం నుంచి జేడీఎస్‌ విజయం సాధించింది. ఇప్పుడు జేడీఎస్ ఆ సీటును తిరిగి కైవసం చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ సరైన అభ్యర్థిని నిలబెట్టడంలో ఆ పార్టీ నానా తంటాలు పడుతోంది. ఈ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన దివంగత ఎమ్మెల్యే హెచ్‌ఎస్‌ ప్రకాష్‌ కుమారుడు, స్థానిక నాయకుడు స్వరూప్‌ ప్రకాష్‌కు టికెట్‌ ఇస్తారని ప్రచారం తెరపైకి వచ్చింది.

స్వరూప్‌కు జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి మద్దతు ఉంది. అయితే హెచ్‌డీ దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ మాత్రం తన భార్య భవానీని ఆ స్థానం  నుంచి రంగంలోకి దింపేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంతి ఇప్పుడు దేవెగౌడ కోర్టులో ఉంది. ఆయన ఆశీర్వాదం.. ఎవరికి అవకాశం ఇవ్వాలో ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. దేవెగౌడ తన కోడలు భవానీ కంటే స్వరూప్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

అయితే దాని వెనుక ఒక కారణం ఉందని అంటున్నారు. 1991లో దేవెగౌడ పార్లమెంటుకు హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు. ప్రస్తుతం హాసన్ లోక్‌సభ స్థానం నుంచి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ ఎంపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వరూప్‌ కంటే తన కోడలుకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు చెడ్డపేరు తెస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ డ్రామా తదుపరి భాగాలు ఖచ్చితంగా దేవెగౌడ గదిలోకి మారుతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !