కాటన్​కు బదులు  కండోమ్ క‌వ‌ర్.. మధ్యప్రదేశ్ వైద్యుల నిర్లక్ష్యం..  

By Rajesh KFirst Published Aug 21, 2022, 5:28 AM IST
Highlights

మధ్యప్రదేశ్ మొరెనా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్లక్ష్యం బహిర్గతమైంది, రక్తస్రావం ఆపడానికి మహిళ తలపై కండోమ్ రేపర్ కట్టారు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య సౌకర్యాల పేరుతో కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకుంటున్నప్పటికీ, ఈ వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా  మొరెనా జిల్లాలోని పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఓ మహిళ తలకు గాయమైతే.. రక్తం ఆగడానికి కండోమ్ కవర్​ను పెట్టి కట్టు వేశారు. రక్తం అదుపు కాకపోవడం వల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహిళను పంపించగా.. కట్టు(బ్యాండేజ్)  విప్పి చూసిన ఆస్పత్రి వైద్యులు  ఉలిక్కిపడ్డారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వైద్యారోగ్య శాఖ కీలక చర్యలు చేపట్టింది.

 అసలేమైందంటే.. పోర్సాలోని ధరమ్‌గఢ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల రేష్మీబాయి భార్య లాలారామ్ ఇంట్లో నిద్రిస్తోంది. ఈ క్రమంలో పైకప్పు నుంచి ఇటుక పడి రేష్మాబాయి తలపై పడింది.  దీంతో ఆ మహిళ తలకు తీవ్రగాయ‌మైంది. గాయపడిన మహిళను వెంటనే పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తరలించారు. ఇక్క‌డి వైద్య సిబ్బంది.. రక్తస్రావం ఆపడానికి  కండోమ్‌ల ఖాళీ ప్యాకెట్‌ను అతికించారు. అయినా.. ర‌క్త స్రావం ఆగ‌క‌పోవ‌డంతో వృద్ధ మహిళను మోరెనా జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. 

గాయపడిన మహిళకు ప‌రిశీలించ‌డానికి కట్లు విప్పిన జిల్లా వైద్యులకు.. పోర్సా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వాకం బయటపడింది. బాధితురాలి గాయాలకు కండోమ్ కవర్ పెట్టి కట్లు కట్టినట్లు తేలింది. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. దూదితో కట్లు వేయడానికి బదులుగా నిర్లక్ష్యంగా కండోమ్ కవర్​ను అడ్డుగా పెట్టి కట్టు వేయడంపై ఆరోగ్యశాఖ అధికారులు మండిపడ్డారు.

click me!