బెంగాల్‌లో హింస: సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో బీజేపీ పిటిషన్

By Siva KodatiFirst Published May 4, 2021, 7:27 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాకాండపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తృణమూల్ కార్యకర్తలు హింసకు పాల్పడ్డారనీ.. హత్యలు, అత్యాచారాలతో భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాకాండపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తృణమూల్ కార్యకర్తలు హింసకు పాల్పడ్డారనీ.. హత్యలు, అత్యాచారాలతో భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఎన్నికలకు ముందు, పోలింగ్ సమయంలో, ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్లో జరిగిన హింసపై సీబీఐ విచారణ జరపాలని భాటియా కోరారు. 2018 నాటి తన పెండింగ్ పిల్‌కు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు గౌరవ్.

హింసకు పాల్పడుతున్న వారిపై తీసుకున్న చర్యలు, కేసులు, అరెస్టుల గురించి సమగ్ర నివేదిక సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు.  హింస కారణంగా పశ్చిమ బెంగాల్లో శాంతి, భద్రతల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆయన చెప్పారు.

Also Read:నందిగ్రామ్‌లో రీకౌంటింగ్‌కి మమత డిమాండ్

ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ.. ఇటీవల జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉందని భాటియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గానూ 200 పైచిలుకు స్థానాలను గెలుచుకుంది టీఎంసీ. 

ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బెంగాల్ ప్రభుత్వం నుండి నివేదిక కోరారు. హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మోడీ.. బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు మంగళవారం ఫోన్ చేసి శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. కాగా ఈ హింసలో కనీసం 12 మంది మరణించారని తెలిపారు. 

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్‌కతా చేరుకున్నారు. దేశ విభజన సమయంలోనే ఇంత తీవ్రమైన హింస జరిగిందనీ, ఆ తర్వాత ఎక్కడా ఇంతటి హింస జరగలేదని ఆయన వ్యాఖ్యానిచారు.

టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని, 4వేలకు పైగా ఇళ్లను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా తోసిపుచ్చింది. బెంగాల్ శాంతి ప్రియమైన ప్రదేశమని పేర్కొంది. అసలు బీజేపీనే తీవ్ర హింసకు పాల్పడిందని మమతా బెనర్జీ ఆరోపించారు. 
 

click me!