క్రాకర్స్ కాల్చడం నుంచి వాహనాలకు నిప్పు పెట్టే వరకు.. గుజరాత్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. 19 మంది అరెస్టు

By Mahesh KFirst Published Oct 25, 2022, 12:59 PM IST
Highlights

గుజరాత్‌లో దీపావళి నాడే రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిన్న రాత్రి 12.45 గంటల ప్రాంతంలో క్రాకర్స్ కాలుస్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఆ తర్వాత స్థానిక వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపైకీ పెట్రోల్ బాంబ్ విసిరేశారు.
 

వడోదర: గుజరాత్‌లో దీపావళి రోజున రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వడోదర నగరంలో క్రాకర్స్ కాల్చడంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. తొలుత వాగ్వాదం జరిగినా ఆ తర్వాత ఒక గ్యాంగ్ పై మరో గ్యాంగ్ రాళ్లు రువ్వుకునే దాకా వెళ్లింది. అనంతరం, అక్కడే ఉన్న కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు స్పాట్‌కు రాగానే వారిపైనా పెట్రోల్ బాంబు విసిరేశారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన 19 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. పోలీసులపై పెట్రోల్ బాంబ్ విసిరిన నిందితుడినీ అదుపులోకి తీసుకున్నారు.

వడోదరలో రాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైర్ క్రాకర్స్ కాలుస్తుండగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రాకెట్ బాంబులను ఒకరి పై మరొకరు విసిరారు. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు రాళ్లు విసిరారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వాహనాలు, ఇతరుల ఆస్తులను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో ఉన్న మూకలో ఒకరు అక్కడి వీధి దీపాలకు కరెంట్ సరఫరాను నిలిపేసినట్టు స్థానికులు తెలిపారు. తద్వారా వారిని ఎవరూ గుర్తుపట్టకుండా ఉంటుందని వారు భావించినట్టు తెలుస్తున్నది.

Also Read: దీపావళి వేడుకల్లో అపశృతి.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్న బాధితులు..

ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నట్టు పోలీసులు వివరించారు. ఘటన గురించి తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టినట్టు వివరించారు. దోషులను పట్టుకునే పనుల్లో ఉన్నారు.

click me!