మణిపూర్‌లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి అమిత్ షా.. ‘పరిష్కారం కేంద్రం చేతిలోనే ఉంది’

By Mahesh KFirst Published May 30, 2023, 5:02 PM IST
Highlights

మణిపూర్‌లో శాంతి పున:స్థాపనకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన ఈ రోజు మణిపూర్ పర్యటనలో ఉన్నారు. హింసాత్మక ఘర్షణలతో కల్లోలితంగా మారిన ఈ రాష్ట్రంలో శాంతి సామరస్యతను నెలకొల్పడానికి ఆయన సీఎం, క్యాబినెట్ మంత్రులు, మైతేయి, కుకి ప్రతినిధులతో సమావేశాలు జరుపుతున్నారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు కల్లోలిత మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. హింస పేట్రేగి రాష్ట్రమంతటా ఉద్రిక్తత నెలకొన్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, కుకీ ఎమ్మెల్యేలు, మైతేయి ఎమ్మెల్యేలు, పౌర సమాజ ప్రతినిధులతో సమావేశం కావడానికి వెళ్లారు. మణిపూర్ వెళ్లిన తర్వాత సీఎం ఎన్‌ బీరెన్ సింగ్, ఆయన క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హింసను అదుపు చేయడానికి తీసుకున్న చర్యలనూ విన్నారు. అనంతరం, పౌర సమాజ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశం తర్వాత రాష్ట్రంలో తామంతా కలిసి శాంతి, సౌభాగ్యాలను పున:స్థాపించడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. స్థానికులను ఉద్దేశించి.. మీరు కూడా సహకరిస్తే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకోల్పడం వేగంగా సాధ్యపడుతుందని ఆయన అన్నారు.

మణిపూర్‌లో శాంతి సామరస్యతల కోసం అమిత్ షా ఈ రోజు మైతేయి, కుకి సంఘాలు, కుకి ఎమ్మెల్యేలు, ఇతర అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యే షెడ్యూల్ పెట్టుకున్నారు. హింస ప్రధానంగా చోటుచేసుకున్న చురచాండ్‌పూర్ జిల్లాకు వెళ్లారు. ట్రైబల్ మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీనికి పరిష్కారం చూపెట్టగలుగుతందనే పోస్టర్లు కనిపించాయి. 

కుకి కమ్యూనిటీ ఎమ్మెల్యే (బీజేపీ) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎంపై నమ్మకం పోయిందని అన్నారు. మైతేయి, కుకి సంప్రదింపులు, చర్చలు సీఎం బీరెన్ సింగ్ సమక్షంలో జరగడానికి అంగీకరించబోమని కరాఖండిగా చెప్పారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలని చెప్పడం గమనార్హం. సీఎం బీరెన్ సింగ్ మైతేయి పక్షపాతి అని, కుకిలను ఉగ్రవాదులతో పోల్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సోమవారం ఉదయమే ఆయన ఇంఫాల్ చేరుకున్నారు. సీఎం, క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. మణిపూర్ హింసలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలా ఉండగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మంగళవారం మణిపూర్ హింస గురించి వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో సవాళ్లు ఇంకా ఉన్నాయని, కానీ, కొంత కాలం తర్వాత అక్కడంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ తిరుగుబాటేమీ లేదని స్పష్టం చేశారు. 

Also Read: మణిపూర్‌లో పోలీసుల కాల్పుల్లో 40 మంది తిరుగుబాటుదారులు హతం: సీఎం బీరెన్ సింగ్.. ‘కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు’

మే 3వ తేదీన మొదలైన హింస కారణంగా రాష్ట్రంలో సుమారు 80 మంది వరకు మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మైతేయీలకు ఎస్టీ హోదా ఇవ్వాలనే నిర్ణయం తక్షణ కారణమైనప్పటికీ భూముల పై హక్కు, ప్రాబల్యం వంటి ఇతర కారణాలూ ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే కుకిలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నట్టు అర్థమవుతున్నది. మైతేయీలు రాజధాని నగరం ఇంఫాల్‌లో అధికంగా ఉంటారు. కుకి తెగలు కొండ ప్రాంతాల్లో నివసిస్తాయి. 

ఈ రాష్ట్రంలో ఉండే నాగాలు, కుకిలు ఎస్టీ కేటగిరీలో ఉంటారు. 

ఇక్కడ కుకి తెగకు, మైతేయీలకు మాత్రమే ఘర్షణలు జరుగుతున్నాయి. నాగాలకు అందులో ప్రమేయం లేకపోవడం గమనార్హం.

పొరుగు రాష్ట్రంలో నాగాలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. మణిపూర్‌లోనూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నదనే విషయం తెలిసిందే.

మణిపూర్‌లో గత 25 రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. తాజాగా ఈ నెలాఖరు వరకు అంతర్జాల సేవలపై ఆంక్షలు విధించారు.

click me!