సీఎం వర్సెస్ మాజీ సీఎం: నాతో పరుగు పందేనికి సిద్ధమా? తేల్చుకుందాం వస్తావా?

By telugu teamFirst Published Oct 3, 2021, 5:32 PM IST
Highlights

నా హెల్త్ ఫిట్‌నెస్ సూపర్. నా హెల్త్‌పై కామెంట్లు చేస్తున్నావా? ఛలో.. నేనే నీకు సవాల్ వేస్తున్నా.. ఇద్దరం పరుగు పందెం వేసుకుందామా? అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సవాల్ విసిరారు.
 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో మాజీ సీఎం కమల్‌నాథ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన ఆరోగ్యంపై బీజేపీ నేతల కామెంట్లను కట్టిపెట్టడానికి తనదైన శైలిలో సవాల్ విసిరారు. వట్టి మాటలు కట్టిపెట్టవోయ్.. నా ఫిట్‌నెస్ అమోఘం... నాతో పరుగు పందేనికి సిద్ధమా అన్నట్టుగా సవాల్ చేశారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో నెగ్గలేక ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. జ్యోతిరాదిత్య సిందియా చక్రం తిప్పడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారాన్ని చేపట్టారు. కమల్‌నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరువురూ కాంగ్రెస్, బీజేపీల్లో సీనియర్ నేతలు. వీరి మధ్య ఘాటైన విమర్శలతోపాటు అప్పుడప్పుడు ఛలోక్తులు పేలుతుంటాయి. ఈ వరుసలోనే తాజాగా కమల్‌నాథ్ చమత్కారంతో తనపై విమర్శలకు ఫుల్‌స్టాప్ వేశారు.

74 ఏళ్ల కమల్‌నాథ్ వయోధికుడని, ఆయనకు వయసు సంబంధ సమస్యలున్నాయని, అందుకే ఢిల్లీలో రెస్ట్ తీసుకుంటున్నారని ఆయన కంటే 12ఏళ్ల చిన్నవారైనా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల తరుచూ కామెంట్ చేశారు. దీనిపై కమల్‌నాథ్ స్పందించారు. ‘నా ఆరోగ్యంపై రాష్ట్రంలో పెద్ద డిబేట్ జరుగుతున్నది. నేను వృద్ధుడినని, జ్వరపీడితుడడినని శివరాజ్ జీ అంటున్నారు. శివరాజ్ జీ నీకో సవాల్ విసురుతున్నా. ఛలో.. ఇద్దరం కలిసి పరుగు పందెం పెట్టుకుందామా?’ అని కమల్‌నాథ్ అన్నారు.

‘నాకు నిమోనియా ఉన్నది. అందుకే కొవిడ్ తర్వాత మళ్లీ చెకప్‌లకు వెళ్లాను. ఎవరైనా ఈ చెకప్‌లు చేసుకోవాల్సిందే. అన్ని టెస్టులూ చేసుకున్నాను. అన్ని రిపోర్ట్‌లు నార్మల్ అని వచ్చాయి. కొవిడ్-19 రెండు రకాలు. ఒకటి స్వల్పకాలికమైనది.. రెండోది దీర్ఘకాలికమైనది. నేను రెండోరకం దానితో పోరాడుతున్నాను’ అని తనపై వస్తున్న వ్యంగ్యాస్త్రాలకు చెక్ పెట్టారు.

click me!