స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రుల సంచలన ప్రకటనలు

By telugu teamFirst Published Aug 15, 2021, 4:30 PM IST
Highlights

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంచలన ప్రకటనలు చేశారు. ఒడిశా సీఎం స్మార్ట్ హెల్త్ కార్డులు మొదలు ఉత్తరాఖండ్ సీఎం విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల వరకు పలు నిర్ణయాలు వెల్లడించారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించి చేసిన ప్రసంగంలో కీలక ప్రకటనలు చేశారు. బాలికలకు సైనిక్ స్కూల్స్‌లోకి ప్రవేశ నిర్ణయం మొదలు రూ. 100 కోట్ల గతి శక్తి స్కీమ్ వరకు పలు నిర్ణయాలను వెల్లడించారు. ఇదే తరహాలో దేశంలోని పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు సంచలన ప్రకటనలు చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదలు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరకు వారు చేసిన ప్రకటనలను ఓ సారి చూద్దాం

ఒడిశాలో స్మార్ట్ హెల్త్ కార్డులు
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 3.5కోట్ల మందికి స్మార్ట్ హెల్త్ కార్డులను అందిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డున్నవారందరికీ ఈ స్కీమ్‌ను వర్తింపజేస్తామని తెలిపారు. ఈ పథకం కింద మహిళలు యేటా హాస్పిటల్‌లో చికిత్సకు రూ. 10లక్షల డబ్బును ప్రభుత్వం నుంచి పొందవచ్చు. మిగతా కుటుంబ సభ్యులు రూ. 5 లక్షల వరకు లబ్ది పొందవచ్చు.

గోవాలో ఉచిత నీటి పథకం
గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాష్ట్ర ప్రజలకు ఉచిత నీటి పథకాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కుళాయి నీటిని అందిస్తామని తెలిపారు. నెలకు 16వేల లీటర్ల నీటిని ఈ పథకం ద్వారా అందిస్తామని వివరించారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తాము రాష్ట్రాన్ని కాపాడుతామని, పాకిస్తాన్ అరాచకాలను చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తాము శాంతినే కోరుకుంటున్నామని చెబుతూ పాక్ హద్దుమీరవద్దని తెలిపారు. అలాగే, పాక్ కుయుక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని వివరించారు.

ఢిల్లీలో దేశభక్తి కరిక్యూలం
సెప్టెంబర్ 27 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో దేశభక్తి కరిక్యూలం అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌కు నివాళిగా ఈ కరిక్యూలాన్ని ప్రవేశపెడతున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడం గురించి విద్యార్థులకు బోధిస్తామని తెలిపారు. అవసరమైనప్పుడు దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం చేస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో అక్టోబర్ 2 నుంచి యోగా క్లాసులను నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

ఉత్తరాఖండ్‌లో విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు
నేడు ఆన్‌లైన్ విద్య సర్వసాధారణమైపోయిందని, అందుకే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు అందించే నిర్ణయం తీసుకున్నట్ట ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వివరించారు. 21ఏళ్ల వరకు వాత్సల్య యోజన కింద విద్యార్థులకు నెలకు రూ. 3000 అలవెన్సులు అందిస్తామని తెలిపారు.

పాట రాసిన బెంగాల్ సీఎం దీదీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావోద్వేగపూరిత పాట లిఖించారు. ఈ పాటను శనివారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ‘ఈ దేశం మన అందరిది. మన స్వేచ్ఛను హరించే శక్తులకు ఎదురొడ్డడానికి మనమంతా బలోపేతమవ్వాలి. ఈ రోజు కోసం దీర్ఘ పోరాటం చేసి బలిదానమిచ్చిన యోధులను విస్మరించవద్దు’ అనే పాదాలు పాటలో ఉన్నాయి.

చత్తీస్‌గడ్‌లో నాలుగు కొత్త జిల్లాలు
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరో నాలుగు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే, 18 కొత్త తెహసీళ్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 28 జిల్లాలున్నాయి. కొత్త జిల్లాలలో వీటి సంఖ్య 32కు చేరనుంది.

click me!