మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పించారు.
లక్నో : మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పించారు. శాస్త్రి భవన్‌లో ఆయన విగ్రహానికి సీఎం యోగి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మహేంద్ర సింగ్, లాల్జీ ప్రసాద్ నిర్మల్, ప్రధాన కార్యదర్శి మనోజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ప్రధాని శాస్త్రి గొప్పతనాన్ని ట్విట్టర్ వేదికన గుర్తుచేసుకున్నారు సీఎం యోగి. నిజాయితీ, నిబద్ధతకు లాల్ బహదూర్ శాస్త్రి ప్రతీక అని కొనియాడారు. 'జై జవాన్-జై కిసాన్' నినాదంతో దేశంలో నూతన చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. భారత రత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నమస్కారాలు అంటూ పోస్ట్ చేశారు.
భారత రాజకీయాల్లో సామాన్య జీవనం, ఉన్నత ఆదర్శాలకు ఆయన ప్రతీక అని సీఎం అన్నారు. అంతేకాదు ప్రజాస్వామ్యానికి ఆయన 'పాఠశాల' లాంటి వారు అంటూ లాల్ బహదూర్ శాస్త్రిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు.