ఇక యూపీ ప్రజలకు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ : సినిమాలపై యోగి సర్కార్ స్పెషల్ ఫోకస్

By Arun Kumar PFirst Published Oct 2, 2024, 12:47 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో మూతపడిన సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు, కొత్త హాళ్ల నిర్మాణానికి యోగి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు పరిశ్రమ హోదా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

లక్నో: యోగి కేబినెట్ కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మూతపడిన సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లు లేని జిల్లాల్లో వాటి నిర్మాణానికే కాదు రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణాన్ని కూడా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇక ఇప్పటికే ఉన్న థియేటర్లను ఆధునీకరించడం కోసం సమగ్ర ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.

 సినిమా రంగంపై యోగి సర్కార్ దృష్టి 

రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా మాట్లాడుతూ... రాష్ట్రంలో మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లను తిరిగి మనుగడలోకి తీసుకురావడం, ఇప్పటికే నడుస్తున్న థియేటర్ల పునర్నిర్మాణం లేదా పునరుద్ధరణకు సహకారం అందించనున్నట్లు తెలిపారు., మల్టీప్లెక్స్‌లు లేని జిల్లాల్లో కొత్తగా మల్టీప్లెక్స్‌లను నిర్మించడం, సినిమా హాళ్ల ఆధునీకరణ కోసం సమగ్ర ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. సినిమా హాళ్లు లేదా మల్టీప్లెక్స్‌లు చెల్లించే ఎస్‌జీఎస్టీ నుంచి ఈ సబ్సిడీని అందిస్తామని... దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు.

Latest Videos

ఏడు రకాల సబ్సిడీలు

1. ఈ పథకం ప్రారంభమైన తేదీ నుంచి 5 సంవత్సరాల లోపు మూతపడిన లేదా నడుస్తున్న సినిమా హాళ్లను కూల్చివేసి కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆధునిక సినిమా హాళ్ల నిర్మాణం చేపడితే.. తొలి 3 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 100 శాతం, తర్వాతి 2 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 75 శాతం సబ్సిడీగా అందిస్తారు.

2. పథకం ప్రారంభమైన తేదీ నుంచి 5 సంవత్సరాల లోపు మూతపడిన లేదా నడుస్తున్న సినిమా హాళ్ల అంతర్గత నిర్మాణంలో మార్పులు చేసి తిరిగి ప్రారంభించినా, స్క్రీన్‌ల సంఖ్య పెంచినా.. తొలి 3 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 75 శాతం, తర్వాతి 2 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 50 శాతం సబ్సిడీగా అందిస్తారు.

3. మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఎలాంటి అంతర్గత మార్పులు లేకుండా తిరిగి ప్రారంభించి 31 మార్చి 2025 వరకు జిల్లా మెజిస్ట్రేట్ నుంచి లైసెన్స్ పొంది సినిమాలు ప్రదర్శిస్తే.. తొలి 3 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 50 శాతం సబ్సిడీగా అందిస్తారు.

4. కనీసం 75 సీట్ల సామర్థ్యం కలిగిన సింగిల్ స్క్రీన్ థియేటర్లను కొత్తగా నిర్మించి, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించినా, నిర్వహించకపోయినా.. తొలి 3 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 100 శాతం, తర్వాతి 2 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 50 శాతం సబ్సిడీగా అందిస్తారు.

5. ఒక్క మల్టీప్లెక్స్ కూడా లేని జిల్లాల్లో కొత్తగా మల్టీప్లెక్స్‌లు ప్రారంభిస్తే.. 5 సంవత్సరాల వరకు వసూలైన ఎస్‌జీఎస్టీలో 100 శాతం సబ్సిడీగా అందిస్తారు.

6. ఇప్పటికే మల్టీప్లెక్స్‌లు ఉన్న జిల్లాల్లో కొత్తగా మల్టీప్లెక్స్‌లు నిర్మించి, ప్రారంభిస్తే.. తొలి 3 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 100 శాతం, తర్వాతి 2 సంవత్సరాలు వసూలైన ఎస్‌జీఎస్టీలో 50 శాతం సబ్సిడీగా అందిస్తారు.

7. సినిమా హాళ్లు/మల్టీప్లెక్స్‌ల ఆధునీకరణ కోసం పెట్టిన ఖర్చులో 50 శాతం మేరకు వసూలైన ఎస్‌జీఎస్టీ నుంచి సబ్సిడీ అందిస్తారు.

ఐటీ సేవలకు 'పరిశ్రమ' హోదా

యోగి ప్రభుత్వం సమాచార సాంకేతికతతో పాటు ఐటీ ఆధారిత సేవలకు పరిశ్రమ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల వేగవంతమైన వృద్ధికి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా అన్నారు. ఈ రంగాలకు 'పరిశ్రమ' హోదా కల్పించడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.

హౌసింగ్ డెవలప్‌మెంట్ అథారిటీలు, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీలు తమ పరిధిలోని పారిశ్రామిక విభాగం కింద ఉన్న భూములను ఐటీ లేదా ఐటీఈఎస్ రంగాల సంస్థలకు పారిశ్రామిక ధరలకే కేటాయించనున్నట్లు తెలిపారు. దీంతో ఐటీ,ఐటీఈఎస్ రంగాల్లోని కొత్త సంస్థలకు భూసేకరణ సులభతరం కానుంది. కనీసం 150 కిలోవాట్ల విద్యుత్ వినియోగంతో కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ సంస్థలకు పారిశ్రామిక ధరలకే విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో వారి లాభాలు పెరుగుతాయి...దీంతో ఉత్తరప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని వివరించారు. ఈ పునర్వర్గీకరణ ద్వారా ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఐటీ,ఐటీఈఎస్ రంగాలకు విద్యుత్ ఖర్చులో దాదాపు 18 శాతం ఆదా అవుతుందని అంచనా వేశారు.

click me!