ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బలరాంపూర్‌లోని దేవీపాటన్ మందిరంలో మా పాటేశ్వరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆవులకు బెల్లం, మేత తినిపించి, పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు.
బలరాంపూర్ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ఉదయం మా పాటేశ్వరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల బలరాంపూర్ పర్యటనలో భాగంగా బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, వైద్య కళాశాల, నిర్మాణంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని తనిఖీ చేశారు.
ఇక ఇవాళ (గురువారం) గోరక్షపీఠాధిపతి, ముఖ్యమంత్రి యోగి దేవీపాటన్ శక్తిపీఠానికి చేరుకున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని పూజించి పాదాల చెంత శిరస్సు వంచి తన భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. జగజ్జనని అయిన అమ్మవారిని ఉత్తర ప్రదేశ్ సుఖసంతోషాలతో పాటు సమృద్ధిగా ఉండేలా దీవించాలని ప్రార్థించారు. ఆలయంలో ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు.
undefined
గోవులపై యోగి ఆప్యాయత ..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలను కూడా సందర్శించారు. అక్కడ ఉన్న ఆవులన్నింటికీ బెల్లం, మేత తినిపించారు.పేరుపెట్టి పిలవగానే ఆవులన్నీ గోరక్షపీఠాధిపతి దగ్గరికి పరుగు తీసాయి. గోసేవ చేస్తూనే గోశాల ఏర్పాట్లను సిఎం పరిశీలించారు.
ఇక అమ్మవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆలయ ప్రాంగణాన్ని కూడా సందర్శించారు. అక్కడ ఉన్న భక్తులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేయగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతులెత్తి అందరికీ అభివాదం చేశారు. అదేవిధంగా ఆలయానికి వచ్చిన చిన్నారులకు ముఖ్యమంత్రి చాక్లెట్లు పంచిపెట్టారు. పిల్లల చదువుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. పిల్లలు మనసుపెట్టి చదవాలని సూచించారు.
ఆలయం సమీపంలోని గిరిజన విద్యార్థుల వసతి గృహానికి వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి పిల్లలతో ముచ్చటించారు. వారి చదువులు, భోజనం, వసతి వంటి వాటి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటే ఆలయ మహంత్ మిథిలేష్ నాథ్ యోగి కూడా ఉన్నారు.