సీఎం కుర్చీ నీకు సిద్ధూ ఇచ్చిన బహుమానం: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై సిద్దూ భార్య అటాక్

By Mahesh KFirst Published Jun 9, 2023, 5:57 PM IST
Highlights

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై నవజోత్ సింగ్ సిద్దూ భార్య నవజోత్ కౌర్ సిద్దూ ఫైర్ అయ్యారు. భగవంత్ మాన్‌కు సీఎం కుర్చీ..  తన భర్త సిద్దూ ఇచ్చిన బహుమానమే అని పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ నవజోత్ సింగ్ సిద్దూ భార్య నవజోత్ కౌర్ సిద్దూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎం కుర్చీ భగవంత్ మాన్‌కు నవజోత్ సింగ్ సిద్దూ ఇచ్చిన బహుమానం అని పేర్కొన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి నవజోత్ సింగ్ సిద్ధూ సారథ్యం వహించాలని, ఆయన నాయకత్వంలోనే ఎన్నికల బరిలోకి దిగాలని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావించారని తెలిపారు. కానీ, నవజోత్ సింగ్ సిద్దూ తన పార్టీని మోసం చేయాలని అనుకోలేదని, అందుకే పార్టీ మారలేదని వివరించారు. అందువల్లే ఆ అవకాశం భగవంత్ సింగ్ మాన్‌‌ను వరించిందని పేర్కొన్నారు.

భగవంత్ మాన్, నవజోత్ సింగ్ సిద్దూల మధ్య వాగ్వాదం జరుగుతున్న తరుణంలో నవజోత్ కౌర్ సిద్దూ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. 

నవజోత్ కౌర్ ట్విట్టర్‌లో భగవంత్ మాన్ పై విమర్శలు సంధించారు. ‘సీఎం భగవంత్ మాన్.. ఇన్నాళ్లు నిగూఢంగా ఉండిపోయిన ఓ రహస్యాన్ని ఈ రోజు మీకు చెబుతాను. మీరు కూర్చున్న గౌరవప్రదమైన సీఎం కుర్చీ.. మీ పెద్దన్న నవజోత్ సింగ్ సిద్దూ ఇచ్చిన బహుమానమే. మీ సీనియర్ లీడర్ పంజాబ్‌లో నవజోత్ సింగ్ సిద్దూనే నాయకత్వం వహించాలని కోరుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

నవజోత్ సింగ్ సిద్దూను కేజ్రీవాల్ అప్రోచ్ అయ్యారని, అనేక మార్గాల్లో ఆయనను చేరుకున్నారని కౌర్ తెలిపారు. కానీ, ఆయన ఎలాంటి సంఘర్షణలను కోరుకోలేదు కాబట్టి, కేజ్రీవాల్ ఆఫర్‌ను తిరస్కరించారని నవజోత్ కౌర్ వివరించారు.

Also Read: పుట్టిన గడ్డతో భారతీయ ముస్లింలది భావోద్వేగ సంబంధం.. సాంస్కృతికంగా పెనవేసుకున్నారు!

‘నిజమైన మార్గంలో మీరు నడవండి. ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తాడు, కానీ, ఆ దారి వీడినా ఆయన నీ కుడి, ఎడమలను టార్గెట్ చేసుకుంటాడు. బంగారు  పంజాబ్ రాష్ట్రమే ఆయన కల. దీని కోసం ఆయన 24 గంటలో శ్రమిస్తాడు’ అని నవజోత్ కౌర్ పేర్కొన్నారు.

పంజాబ్ డైలీ ఎడిటర్ పై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఫోకస్ పెట్టడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు జలంధర్‌లో గుమిగూడారు. వీరిని విమర్శిస్తూ వారంతా ఒకే తాను ముక్కలు అంటూ భగవంత్ మాన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిఘా స్వామ్యంగా మార్చివేస్తున్నారని, పంజాబ్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేస్తూ నీతులు చెబుతున్నారని సిద్దూ రివర్స్ ఫైర్ అయ్యారు.

click me!