లిక్కర్ స్కాం : కేజ్రీవాల్‌కు చుక్కెదురు .. ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే , ఢిల్లీ కోర్టు సమన్లు

By Siva Kodati  |  First Published Feb 7, 2024, 4:27 PM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది . లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి ఫిబ్రవరి 17న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం సమన్లలో తెలిపింది. 


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి ఈడీ విచారణకు సహకరించడం లేదంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఐదుసార్లు నోటీసులు ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. 

మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈడీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసింది. గడిచిన నాలుగు నెలల్లో కేజ్రీవాల్ నాలుగు సమన్లను దాటవేశారు. ‘‘సమన్లు ఇచ్చినా అరవింద్ కేజ్రీవాల్ కనిపించడం లేదని, ఆయన ప్రభుత్వోద్యోగి’’ అని ఈడీ కోర్టుకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. 

Latest Videos

మరోవైపు కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీ స్కాంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌కు జారీ చేసిన సమన్లను తమ లీగల్ టీమ్ అధ్యయనం చేస్తోందని ఆప్ పేర్కొంది. 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు :

మద్యం వ్యాపారులకు లైసెన్సులను మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021 - 22 ఎక్సైజ్ ఎక్సైజ్ పాలసీని కార్టెలైజేషన్‌కు అనుమతించిందని , ఇందుకోసం లంచాలు చెల్లించిన కొంతమంది డీలర్లకు ఇది అనుకూలంగా వుందని ఈడీ ఆరోపించింది. ఈ అభియోగాలను పలుమార్లు ఆప్ ఖండించింది. ఈ పాలసీని తర్వాత రద్దు చేయగా.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణకు సిఫారసు చేశారు. అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 
 

click me!