సిద్ధూ మూసేవాలా హత్య వెనుక క్లోజ్ ఫ్రెండ్స్.. త్వరలోనే పేర్లు ప్రకటిస్తా: సింగర్ తండ్రి సంచలన ఆరోపణలు

By Mahesh KFirst Published Aug 14, 2022, 3:46 PM IST
Highlights

సిద్ధూ మూసేవాలా హత్య వెనుక ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, కొందరు రాజకీయ  నేతలు ఉన్నారని సిద్ధూ తండ్రి బల్కార్ సింగ్ ఆరోపించారు. త్వరలోనే వారి పేర్లు బయటపెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూను దారుణంగా కాల్చి చంపేసిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: పంజాబ్ ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్యతో పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఎపిసోడ్ బయటకు వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులే సిద్ధూ మూసేవాలాను హతమార్చినట్టు బలమైన వాదనలు వచ్చాయి. సిద్ధూ మూసేవాలా హత్య జరిగి 80 రోజులు గడిచాయి. తాజాగా, సిద్ధూ మూసేవాలా తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు హత్య వెనుక  వాడి క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారని పేర్కొన్నారు.

తన కొడుకు హత్య వెనుక ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, మరికొందరు రాజకీయ నేతలు ఉన్నారని సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కార్ సింగ్ ఆరోపణలు చేశారు. త్వరలోనే వారి పేర్లు వెల్లడిస్తా అని ప్రకటించారు.

తన కుమారుడు సిద్ధూ మూసేవాలా అనతి కాలంలో వేగంగా ఎదిగాడు. వేగంగా పాపులారిటీ సంపాదించుకున్నాడని ఆయన వివరించారు. తన కొడుకు ఎదుగుదల కొందరు జీర్ణించుకోలేకపోయారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూడా తన కుమారుడి విషయం తప్పుదారి పట్టించారని ఆరోపించారు. తన కుమారుడి అన్ని డీల్స్ వారి ద్వారానే జరగాలని కొందరు సంకుచితంగా ఆలోచించారని తెలిపారు. కానీ, సిద్ధూ స్వతంత్రతను కోరుకునే మనిషి అని వివరించారు. వారు దీన్ని అంగీకరించలేకపోయారని, అందుకే తన కొడుకును హతమార్చారని పేర్కొన్నారు.

మే 29వ తేదీన సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాను పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో దారుణంగా కాల్చి చంపారు. రాష్ట్ర ప్రభుత్వం వీఐపీలకు సెక్యూరిటీ గార్డులను కుదించిన తర్వాతి రోజే సిద్ధూ మూసేవాలా హత్య జరిగింది. అనంతరం, భగవంత్ సింగ్ మాన్ మళ్లీ సెక్యూరిటీని రీస్టోర్ చేయకతప్పలేదు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

తనపై దాడి జరగడానికి ముందు సిద్ధూ మూసేవాలా మహీంద్రా కారులో వెళ్లారు. అందులో కజిన్, ఒక ఫ్రెండ్‌తో కలిసి వెళ్లారు. తనపై దాడి జరిగినప్పుడు వారిద్దరూ అక్కడే ఉన్నారు. వారికీ కొన్ని గాయాలు అయ్యాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అంకిత్ సిర్సా.. సిద్ధూ మూసేవాలాను చంపేసి ఉంటారని చాలా మంది నమ్ముతున్నారు. సిద్ధూ మూసేవాలా రిపోర్టులో తనకు 19 బుల్లెట్లు దిగినట్టు తేలింది. 15 నిమిషాల్లో సిద్ధూ మరణించినట్టు అటాప్సీ రిపోర్టు వెల్లడించింది.

click me!