CJI NV Ramana: "న్యాయం చేయడం న్యాయస్థానాల బాధ్యత మాత్రమే కాదు" 

By Rajesh KFirst Published Aug 16, 2022, 2:14 AM IST
Highlights

CJI NV Ramana: భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి సంరక్షకునిగా భారత సుప్రీంకోర్టు ఉందని అన్నారు. 

CJI NV Ramana: న్యాయం చేయడం కేవలం న్యాయస్థానాల బాధ్యత కాదని, న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలోని ప్రతి విభాగానికి సంబంధించిన పనులు రాజ్యాంగ స్ఫూర్తితో ఉండాలని సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  జస్టిస్ రమణ పేర్కొన్నారు.  సుప్రీంకోర్టు ప్రాంగణంలో 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాలు తెలిపారు.

న్యాయం అనేది కేవలం న్యాయస్థానాల బాధ్యత కాదనీ, ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 38లో పేర్కొన్న రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలను ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రజలకు న్యాయం జరిగేలా సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయడం రాష్ట్రం బాధ్యత అని అన్నారు. రాజ్యాంగ చట్రంలో ప్రతి విభాగానికీ ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వబడిందని తెలిపారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 న్యాయం అందించడం మాత్రమే కోర్టుల బాధ్యత అనే భావనను తొలగిస్తుంద‌ని అన్నారు. దీని ప్రకారం, రాష్ట్రానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పొందడం అత్యవసరమని తెలిపారు. రాష్ట్రంలోని మూడు అంగాలు- కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థ- రాజ్యాంగ విశ్వాసానికి సమానంగా రక్షకులు," అని ఆయన అన్నారు.

రాజ్యాంగానికి సుప్రీం కోర్ట్ గార్డియన్

పౌరుల వివాదాలను సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరిస్తుందని, తప్పు జరిగితే వారికి అండగా నిలుస్తుందని తమకు తెలుసునని సీజేఐ అన్నారు. వ్రాతపూర్వక రాజ్యాంగానికి కట్టుబడి న్యాయవ్యవస్థ నడుస్తుందని, దానిపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. న్యాయవ్యవస్థ నుండి తమకు ఉపశమనం, న్యాయం లభిస్తుందని ప్రజలకు నమ్మకం ఉందనీ,  న్యాయ‌వ్య‌వ‌స్థ‌ వారికి వివాదానికి పరిష్కారాన్ని అందిస్తుందనీ, తప్పు జరిగినప్పుడు న్యాయవ్యవస్థ తమకు అండగా నిలుస్తుందని వారికి తెలుసున‌ని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో రాజ్యాంగ పరిరక్షణకు సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందనీ వివ‌రించారు. 
 
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాజ్యాంగ నిబంధనలు, చట్టాల గురించి కొందరికే తెలియడం దురదృష్టకరమని జస్టిస్ రమణ అన్నారు. దీనితో పాటు, రాజ్యాంగ హక్కులు,  విధులపై ప్రజలకు అవగాహన పెంపొందించుకోవాల‌ని ఆయన మ‌రోసారి ఉద్ఘాటించారు. దేశంలోని రాజ్యాంగం, చట్టం గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితిపై ప్రధాన న్యాయమూర్తి విచారం వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాలలో ఒక పాఠశాల విద్యార్థికి కూడా దాని రాజ్యాంగం, చట్టాలపై అవగాహన ఉందని అన్నారు. అలాంటి సంస్కృతి.. మ‌న‌దేశంలో కూడా  రావాల‌ని అన్నారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నిర్ణయాలను సరళమైన భాషలో రాయాల్సిన అవసరం ఉందని, సుప్రీంకోర్టు, హైకోర్టుల ముఖ్యమైన ఉత్తర్వులను సరళమైన భాషల్లో ప్రచురించాలని సీజేఐ అన్నారు. 

ఈ సంద‌ర్భంగా  త్రివ‌ర్ణ ప‌తాక‌ రూపకర్త పింగళి వెంకయ్యను జస్టిస్‌ ఎన్‌వి రమణ స్మరించుకున్నారు.  ఆయనకు నివాళులర్పించారు. దేశంలోని న్యాయవ్యవస్థ చరిత్రను తెలిపే 'కోర్ట్స్‌ ఆఫ్‌ ఇండియా : ఫాస్ట్‌ టు ప్రెజెంట్‌ (భారత న్యాయస్థానాలు నాటి నుంచి నేటి వరకు)' పేరుతో పుస్తక తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకం కేవ‌లం తెలుగులోనే కాకుండా మరో ఆరు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడింది. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడు వికాస్ సింగ్, సొలిసిటర్ తుషార్ మెహతా తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. ఆగస్టు 26న ఎన్వీ రమణ తన పదవి నుండి రిటైర్ అవుతారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (యుయు లలిత్) భారతదేశానికి కొత్త సిజెఐ (49వ)గా నియమితులయ్యారు.

click me!