పార్కింగ్ స్పేస్ ఉంటేనే వాహనాలు కొనడానికి అనుమతించాలి: హైకోర్టు

By telugu teamFirst Published Aug 13, 2021, 6:09 PM IST
Highlights

స్తోమత ఉన్నది కదా అని పార్కింగ్ స్పేస్ లేకున్నా ఓ కుటుంబం నాలుగైదు వాహనాలు కొంటూ పోతుంటే అధికారులు చూస్తూ ఊరుకోవద్దని బాంబే హైకోర్టు అధికారులను ఆదేశించింది. సరిపడా పార్కింగ్ స్పేస్ ఉంటేనే ఒకటికి మించి వాహనాల కొనుగోలుకు అనుమతించాలని స్పష్టం చేసింది. ఒక ఫ్లాట్‌లో నివసించే ఒక కుటుంబం పార్కింగ్ స్పేస్ లేకున్నా నాలుగైదు కార్లు కలిగి ఉండటం సరికాదని వివరించింది.

ముంబయి: మహారాష్ట్రంలో వాహనాల పార్కింగ్ స్పేస్‌పై ప్రత్యేక పాలసీ లేకపోవడంపై బాంబే హైకోర్టు మండిపడింది. తగిన పార్కింగ్ స్పేస్ లేకుంటే గందరగోళం ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. పౌరులకు సరిపడా పార్కింగ్ స్పేస్ లేకుంటే వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు అనుమతించరాదని అధికారులను ఆదేశించింది. ఒకే ఫ్లాట్‌లో ఉండే కుటుంబం తమ వాహనాలను పార్కింగ్ చేయడానికి స్థలం లేకుంటే వారు నాలుగైదు కార్లు కలిగి ఉండటాన్ని అంగీకరించవద్దని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన యునిఫైడ్ డెవలప్‌మెంట్ కంట్రోల్, ప్రమోషన్ రెగ్యులేషన్స్ రూల్స్‌ను సవాలు చేస్తూ ముంబయి వాసి, యాక్టివిస్టు సందీప్ ఠాకూర్ బాంబేహైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నోటిఫికేషన్ కార్ పార్కింగ్ స్పేస్‌ను కుదించడానికి భవన నిర్మాణదారులు, డెవలపర్లకు అవకాశమిస్తున్నదని పేర్కొన్నారు. ఒకవేళ అపార్ట్‌మెంట్ కాలనీల్లో పార్కింగ్‌కు సరిపడా స్థలం కేటాయించకుంటే నివాసులు హౌజింగ్ సొసైటీ బయట కార్లు, వాహనాలు పార్క్ చేసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిల ధర్మాసనం విచారించింది. ‘కొత్త కార్ల కొనుగోళ్లను తగ్గించాల్సిన అవసరముంది. వాళ్లకు కొనే స్తోమత ఉన్నది కదా అని ఒక కుటుంబం నాలుగైదు వాహనాలు కొంటూ ఉంటే ఉపేక్షించవద్దు. అందుకు
అనుమతించవద్దు. వాళ్లకు సరిపడా పార్కింగ్ స్పేస్ ఉన్నదా? లేదా? అనేది సరిచూసుకోవాలి’ అని అధికారులను ఆదేశించింది.

వాహనాల పార్కింగ్ కోసం కచ్చితమైన నిబంధనలు లేకుంటే గందరగోళం ఏర్పడే ముప్పు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికే చాలా చోట్ల రోడ్లపై వాహనాలు కుప్పలు తెప్పలుగా పార్కింగ్ చేస్తూ ఉండటాన్ని చూస్తూనే ఉన్నామని పేర్కొంది. రోడ్డుకు ఇరువైపులా కార్లు పార్క్ చేసి కనిపిస్తున్నాయని, ఫలితంగా 30శాతం రోడ్డు వీటికే పోతున్నదని తెలిపింది. ఇదిప్పుడు సర్వసాధారణమైన దృశ్యంగా మారిందని వివరించింది.

ఇవి వాస్తవమైన ప్రజల సమస్యలని కోర్టు అభిప్రాయపడింది. వీటిని తప్పకుండా వీలైనంత వేగంగా పరిష్కరించాలని సూచించింది. లేదంటే దీర్ఘకాలంలో సమస్యలు రావచ్చునని తెలిపింది. కాబట్టి, పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఒక విధానం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ పిల్‌పై రెండు వారాల్లో సమాధానం సమర్పించాల్సిందిగా రాష్ట్ర కౌన్సిల్ మనీష్‌ను హైకోర్టు ఆదేశించింది. 

పార్కింగ్ ప్లేస్‌పై రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ఇప్పటికే చాలా మంది ముంబయి వాసులు భావిస్తున్నారు. చాలా అపార్ట్‌మెంట్లు, హౌజింగ్ సొసైటీల ఎదుట వాహనాలు బార్లు తీసి ఉండటం ముంబయిలో సాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు రూలింగ్‌కు ప్రాధాన్యత సంతరించింది.

click me!