నోట్లరద్దుకు 6 ఏళ్లు.. అయినా రికార్డు స్థాయిలో నగదు చలామణి.. ప్రజల వద్ద రూ. 30 లక్షల కోట్లు

Published : Nov 06, 2022, 06:41 PM ISTUpdated : Nov 06, 2022, 06:50 PM IST
నోట్లరద్దుకు 6 ఏళ్లు.. అయినా రికార్డు స్థాయిలో నగదు చలామణి.. ప్రజల వద్ద రూ. 30 లక్షల కోట్లు

సారాంశం

పెద్ద నోట్ల రద్దుకు ఆరు సంవత్సరాలు గడిచాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఊహించినట్టు డిజిటల్ పేమెంట్లు పెరిగి.. నగదు చలామణిని తగ్గించలేకపోయాయని తెలిసింది. పెద్ద నోట్ల రద్దుకు ముందటి కంటే కూడా నేడు నగదు చలామణి ఎక్కువగా ఉన్నట్టు ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది.  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ అవినీతి, నల్లధనం వంటి లక్ష్యాలను తెలిపారు. ఆ తర్వాత డిజిటల్ ఎకానమీ కూడా లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మిగతా లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయనే విషయాన్ని పక్కనపెడితే చాలా మంది యూపీఐ, ఆన్‌లైన్ పేమెంట్లతో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయనే అభిప్రాయం ఉన్నది. కానీ, తాజాగా వెల్లడించిన ఆర్బీఐ నివేదికలు ఈ అభిప్రాయాన్ని భిన్నమైన విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

అక్టోబర్ 21వ తేదీ నాటికి మన దేశంలో ప్రజల వద్ద నగదు రూ. 30.88 లక్షల కోట్లు ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఆరేళ్ల క్రితం పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి కంటే కూడా ఇప్పుడే ప్రజల వద్ద ఎక్కువ నగదు చెలమాణిలో ఉండటం గమనార్హం. నగదు చలమాణి పతాకస్థాయికి చేరినట్టు స్పష్టం అవుతున్నది.

2016 నవంబర్ 8న ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. 2016 నవంబర్ 4వ తేదీ నాటికీ ఆర్బీఐ లెక్కల ప్రకారం ప్రజల వద్ద ఉన్న డబ్బు కంటే ఇప్పుడు 71.84 శాతం అధికంగా ఉన్నది. 2016 నవంబర్ 4వ తేదీ నాటికి ప్రజల వద్ద డబ్బు రూ. 17.7 లక్షల కోట్లు ఉన్నట్టు అప్పుడు ఆర్బీఐ వెల్లడించింది. అదే విలువ తాజాగా, గత నెల 21వ తేదీ నాటికి రూ. 30.88 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఇప్పుడు తెలిపింది.

Also Read: డీమోనిటైజేషన్ కంటే కరోనా కాలంలోనే పెరిగిన డిజిటల్ పేమెంట్ లావాదేవీలు: సర్వే రిపోర్ట్

బ్యాంకుల దగ్గర ఉన్న కరెన్సీని మొత్తం కరెన్సీ నుంచి తీసి వేసి ఈ విలువను ఆర్బీఐ లెక్కిస్తుంది. బ్యాంకుల వద్ద ఉన్న కరెన్సీని తొలగిస్తే ప్రజల లావాదేవీలు, ట్రేడ్స్, గూడ్స్ కొనడం, సర్వీసులకు చెల్లించడం, అన్ని రకాల కార్యకలాపాలకు ప్రజలు ఉపయోగించే ఈ డబ్బును ఆర్బీఐ పై విధంగా గణిస్తుంది.

ఇటీవలి సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. వ్యాల్యూ, వ్యాల్యూమ్‌లోనూ ఈ డిజిటల్ చెల్లింపులు పెరిగాయని వివరించింది. అదే విధంగా జీడీపీతో పోలిస్తే చలామణిలో ఉన్న కరెన్సీ నిష్పత్తులూ పెరుగుతూ వస్తున్నాయని తెలిపింది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధితోపాటు జీడీపీ పెరుగుదలకు అనుగుణంగా నగదు చలామణి పెరుగుతున్నదని పేర్కొంది. జీడీపీ రేషియోతో చూస్తే డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్నా.. నగదు చలామణిపై ప్రభావం వేయలేకపోతున్నదని తెలిపింది.

పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగినప్పటికీ జీడీపీ రేషియోతో వీటిని చూస్తే తక్కువగానే ఉన్నాయని వివరించింది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..