
ఒడిశా : ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని కాశీపూర్ బ్లాక్ లో కలరా కలకలం రేగింది. ఇక్కడ కలరా వల్ల ఎనిమిది మంది మరణించారు. కలుషిత నీటి ద్వారా సంక్రమించే కలరా వ్యాధి బారిన పడిన పలువురు ఆసుపత్రి పాలయ్యారు. కాశీపూర్ లోని ఎనిమిది పంచాయితీలో ఆరు గ్రామాల్లో కలరా కేసులు నమోదయ్యాయి. కలరాతో 120 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా, ఎనిమిది మంది మరణించారు. దుడుకబహల్ పంచాయితీలో 65 మంది కలరా బారిన పడగా, తికిరి పంచాయితీలో నలభై ఎనిమిది మందికి వ్యాధి సోకింది.
నహతిగూడ పంచాయితీ సనమతికాన గ్రామానికి చెందిన దాల్మీ మాఝీన (60) అనే వృద్ధురాలు కలరా వ్యాధితో ఇటీవల మృతి చెందింది. సోమవారం రాత్రి కడుపు నొప్పి, నీళ్ల విరేచనాలతో బాధపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అక్కడి నీళ్లలో బ్యాక్టీరియాను కనుగొన్నారు. రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్, భువనేశ్వర్ లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం వైద్యుల బృందం అధిపతి డాక్టర్ బిభూతి భూషణ్ పాల్ పరిస్థితిని విశ్లేషించడానికి గ్రామానికి చేరుకున్నారు.
వామ్మో.. మళ్లీ స్వైన్ ఫ్లూ కలవరం.. ఉత్తరప్రదేశ్‌లో పాజిటివ్ కేసు నమోదు
వారు సుమారు 10 నమూనాలను పరీక్షించారు. మూడు నమూనాలలో విబ్రియో కలరే బ్యాక్టీరియాను కనుగొన్నారు. కాశీపూర్ బ్లాక్ నుంచి సేకరించిన నీటి నమూనాలు కూడా బ్యాక్టీరియా ఉన్నట్లుగా కనుగొన్నారు. కలరా బారినపడిన రోగులకు చికిత్స కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాశీపూర్ లోని మండిపిసి, దంగలిసి గ్రామాల్లో రెండు తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గుగుపుట్, డెంగాగుడ, రామగూడ గ్రామాల్లో 3 మొబైల్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేశారు బ్యాక్టీరియా కనిపించిన ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు రోగులను ముందస్తుగా గుర్తించడం కోసం ఇంటింటికి తిరుగుతూ స్క్రీనింగ్ చేస్తున్నారు.