
Shiv Sena (UBT) MP Sanjay Raut: మణిపూర్ హింసలో చైనా ప్రమేయం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మణిపూర్‌లో జాతి హింసలో చైనా ప్రమేయం ఉందనీ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. అంతకుముందు, మణిపూర్ హింసాకాండలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అన్నారు. మణిపూర్, మయన్మార్ ల మధ్య సున్నితమైన సరిహద్దును ఎత్తిచూపిన ఆయన ఇది ముందస్తు ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు కనిపిస్తోందని అన్నారు.
వివరాల్లోకెళ్తే.. మణిపూర్ లో హింసకు ఆజ్యం పోయడంలో చైనా ప్రమేయం ఉందనీ, చైనాపై తీసుకున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. కేంద్రంలో, ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందనీ, మే 3 నుంచి జాతి హింస జరుగుతోందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. హింసకు ఎవరు ముందుగా ప్లాన్ చేశారని ప్రశ్నించారు. "మణిపూర్ హింసలో చైనా ప్రమేయం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 40 రోజులకు పైగా హింస కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లు వదిలి సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేయాలి" అని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
కాగా, 50 రోజులకు పైగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న హింసలో విదేశీ హస్తం ఉందని బీరేన్ సింగ్ సూచించిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా పరిస్థితుల్లోకి జారుకున్నారని రిపోర్టులు సైతం పేర్కొంటున్నాయి. జూన్ 30న ఇంఫాల్ లో బీరేన్ సింగ్ కాన్వాయ్ ను రాజ్ భవన్ వైపు వెళ్లకుండా వేలాది మంది ఆందోళనకారులు అడ్డుకోవడంతో హై వోల్టేజ్ డ్రామా మొదలైంది. ఈ కీలక సమయంలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. మణిపూర్ లో మే 3న ఘర్షణలు మొదలైనప్పటి నుంచి మైతీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.