
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్.. రాష్ట్రంలో అధికార శివసేన(షిండే)-బీజేపీ కూటమితో జత కట్టేందుకు సిద్దమయ్యారు. అజిత్ పవార్ వెంట 29 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజే ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టుగా సమాచారం. అజిత్ పవార్‌తో మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో కొందరు ఎన్సీపీ నేతలు కూడా ఉండనున్నారు. అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే రాజ్‌భవన్‌లో అజిత్ పవార్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. అజిత్ పవార్, ఇతర ఎన్సీపీ నాయకులు రాజ్‌భవన్‌కు చేరుకోగా.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడి వచ్చారు.
గత కొంతకాలంగా ఎన్సీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై ఆయన అలకబూనినట్టుగా తెలుస్తోంది. అలాగే తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతోనే శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు ఎగరవేసినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈరోజు ముంబైలోని అజిత్ పవార్ నివాసంలో ఎన్సీపీ శాసనసభ్యుల బృందం సమావేశమైంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ హాజరుకాలేదు. కాగా, అజిత్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అజిత్ పవార్‌ను నియమించాలని సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ముంబైలో జరిగిన ఈ సమావేశం గురించి తనకు తెలియదని శరద్ పవార్ పూణెలో విలేకరులతో అన్నారు. అయితే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పలు ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్తున్న వేళ.. అందులో భాగంగా ఉన్న ఎన్సీపీలో చీలిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది.